BRS Party: బీఆర్‌ఎస్ పార్టీ సంచలనం.. వారిని కాదని వీరికి నాలుగు టికెట్లు కేటాయింపు మరి గెలుస్తారా?
BRS Party MP Candidates: పార్లమెంట్ ఎన్నికల వేళ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న బీఆర్‌ఎస్ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టికెట్లు ఆశిస్తున్న వారిని కాకుండా వేరేవారికి ఇచ్చి కలకలం రేపింది. సొంత కూతురు కవితకే కేసీఆర్ షాక్ ఇచ్చారు.
Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమవుతున్నది. ఇప్పటికే కరీంనగర్ వేదికగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటిస్తోంది. తాజాగా మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలోనే కీలకమైన చేవెళ్ల, వరంగల్, నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ నుంచి కడియం కావ్యకు టికెట్ కేటాయించారు. ఇక నిజామాబాద్‌లో అనూహ్యంగా బాజిరెడ్డి గోవర్ధన్‌కు అవకాశం కల్పించింది. జహీరాబాద్‌లో గాలి అనిల్ కుమార్‌కు టికెట్ ఇచ్చింది. కొన్ని రోజులుగా ఈ స్థానాలపై సెగ్మెంట్ల వారీగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అభిప్రాయాలు తీసుకున్నారు. అందరి అభిప్రాయం మేరకు వారికి టికెట్లు కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయించారు.
Also Read: KCR Speech: టీవీ ముందు కూర్చుంటా.. రేవంత్ రెడ్డి తాట తీస్తా: కేసీఆర్ సంచలన ప్రకటన
హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో బుధవారం కేసీఆర్ వరంగల్ ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి తనయ కావ్యకు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారు. సమావేశం ముగిసిన కొన్ని గంటలకు అభ్యర్థుల ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఐదు స్థానాలకు గులాబీ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మహబూబ్‌నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ మాలోతు కవిత, ఖమ్మం నామా నాగేశ్వర్ రావు, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్‌కు ప్రకటించారు. ఇప్పటివరకు మొత్తం 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ రెండు స్థానాలు బీఎస్పీకి కేటాయించే అవకాశం ఉంది. మిగిలిన ఆరు స్థానాలపై కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: VH: కన్నీళ్లు పెట్టుకున్న పెద్దాయన.. టికెట్ ఇస్తారా లేదా అని రేవంత్ రెడ్డికి ఆల్టిమేటం
తాజాగా ప్రకటించిన స్థానాలు రాష్ట్రంలోనే కీలకమైనవి. అధికారం కోల్పోయినా కూడా ఎంపీ టికెట్లకు గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున ఆశావహులు ఉన్నారు. చేవెళ్ల నుంచి మాజీ మంత్రి సబితా రెడ్డి తనయుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి టికెట్ ఆశించారు. గతంలో ఇదే స్థానం నుంచి కార్తీక్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. గులాబీ పార్టీ తరఫున అవకాశం కోసం ఎదురుచూస్తుండగా మారిన పరిస్థితుల నేపథ్యంలో కార్తీక్‌కు అవకాశం లభించలేదు. అధికారం ఉండి ఉంటే కార్తీక్‌కు తప్పనిసరిగా టికెట్ లభించేది అని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పట్నం వర్గానికి దెబ్బ కొట్టేందుకు కాసాని జ్ఞానేశ్వర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
కడియం శ్రీహరి
పార్టీ మారుతారనే ఊహాగానాల నేపథ్యంలో అనూహ్యంగా వరంగల్ టికెట్ కడియం కావ్యకు లభించింది. తన కుమార్తె టికెట్ కోసం పార్టీ సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి ఇతర పార్టీలో చేరేందుకు చూస్తున్నారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా సంప్రదింపులు జరిపారనే వార్తలు వచ్చాయి. శ్రీహరి పార్టీ మారకుండా నిలుపుదల చేసేందుకు కావ్యకు టికెట్ కేటాయించాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇక వరంగల్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను గులాబీ పార్టీ నిలువరించింది. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఆయనతో పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడి సముదాయించారు. బుజ్జగింపులు చేపట్టడంతో ఆయన ప్రస్తుతానికి ఆ పార్టీలోనే కొనసాగుతున్నా.. ఏ క్షణంలోనైనా పార్టీ మారే అవకాశం లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter