హైదరాబాద్ : షేక్‌పేట్‌లోని ఓ పెట్రోల్‌ బంక్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం ఓ కారులో పెట్రోల్‌ నింపుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పెట్రోలు బంక్‌ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా.. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి.


దీంతో వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. దీంతో పెను ముప్పు తప్పినట్టయింది. కాగా, ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్దమైంది. అయితే కారులో ఉన్న వ్యక్తి బయటకు దిగడంతో అతను క్షేమంగా బయటపడ్డాడు. అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.