Telugu Desam Party : తెలంగాణలో మళ్లీ తెలుగు దేశం పార్టీనీ పట్టాలెక్కించాలని ఆ పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీలో అధికారంలోకి రావడంతో తెలంగాణ  శ్రేణుల్లో ఎక్కడ లేని జోష్ కనబడుతుంది. తెలంగాణలో కూడా పార్టీకీ మళ్లీ పూర్వపు వైభవాన్ని తీసుకురావాలని తెలంగాణ టీడీపీ శాఖ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తుంది.అడపదడపా హైదరాబాద్ కు వస్తున్న చంద్రబాబుతో  తెలంగాణ నేతలు పెద్ద సంఖ్యలో భేటీ అవుతున్నారట. బాబు హైదరాబాద్ కు వస్తుందన్న సమాచారం తెలియగానే  నేతలు చేసే హడావుడి అంతా ఇంతా ఉండడం లేదట. బాబును కలవడానికి పెద్ద సంఖ్యలో నేతలు ఆయన నివాసానికి క్యూ కడుతున్నారు. దీంతో నేతల రాకతో హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం  సందడిగా మారుతుందట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే  ఒక వైపు ఏపీలో చంద్రబాబు క్షణం తీరిక లేకుండా పాలనా వ్యవహారంలో తలామునకలై ఉంటున్నారు. అలాంటి చంద్రబాబు వ్యక్తిగత పని మీద హైదరాబాద్ కు వస్తే ఇక్కడకూడా నేతల హడావుడ తప్పడం లేదు. ఏపీలో టీడీపీ గెలిచాక తెలంగాణలో కూడా పార్టీనీ బలోపేతం చేయాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తుంది. దీంతో హైదారాబాద్ కు వచ్చిన ప్రతి సారి చంద్రబాబుకు టీటీడీపీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుందంట. చంద్రబాబు కూడా తెలంగాణలో పార్టీనీ బలోపేతం చేయాలని ఆలోచనలో ఉన్నాడు . కానీ అదే సమయంలో ఏపీలో సీఎంగా బిజీగా ఉండడం వల్ల  తెలంగాణ శాఖ వ్యవహారాలు కాస్తా ఆలస్యం అవుతున్నాయి.


గత పదేళ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడం. దీంతో పాటు మెజార్టీ టీడీపీ నేతలు బీఆర్ఎస్ లోకి వెళ్లడంతో తెలంగాణ టీడీపీ పూర్తిగా బలహీనంగా మారింది. ఒకానొక దశలో అసలు ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితికి కూడా టీటీడీపీ చేరింది. ఎప్పుడైతే ఏపీలో అధికారంలోకి రావడం అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి చెందడం టీటీడీపీ కాస్త ఆశలు చిగురించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీటీడీపీనీ తిరిగి పునరుద్దరించినట్లైతే పార్టీ బలంగా మారుతుందని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తెస్తున్నారట. అంతే కాదు త్వరలో జీహెచ్ ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. టీ టీడీపీ బలపడటానికి ఇదే సరైన సమయం అని నేతలు భావిస్తున్నారు. 


మరొక ఆస్తికర అంశం ఏంటంటే చంద్రబాబును టీడీపీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా కలవడం రాజకీయంగా సంచలనంగా మారుతుంది. గతంలో టీడీపీలో పనిచేసి ప్రస్తుతం ఇతర పార్టీలో ఉన్న నేతలు కూడా చంద్రబాబును కలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం.ఇటీవల  చంద్రబాబును పలువురు బీఆర్ఎస్ నేతలు కలిశారు. ఆ నేతలు అందరూ కూడా గతంలో చంద్రబాబుతో  కలిసి పనిచేసిన వారు కావడం విశేషం. ఇప్పుడు ఈ నేతలు చంద్రబాబును కలవడంపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది. వారు త్వరలో తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతారని జోరుగా ప్రచారం నడుస్తుంది. ఇటీవల అలా కలిసిన నేతల్లో కొందరు చంద్రబాబు ముందు కొన్ని డిమాండ్లు పెట్టారని వినికిడి. తమకు తెలంగాణ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగిస్తే పార్టీనీ అన్ని రకాలుగా ముందుండి నడిపిస్తామని చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టారట. దీంతో చంద్రబాబు కూడా ఆలోచనలో పడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత మూడు నాలుగు నెలలుగా టీడీపీ అధ్యక్షుడి ప్రకటన పెండింగ్ లో ఉంటూ వస్తుంది. దీంతో ఆశావాహులు చంద్రబాబును కలిసి తమకే ఆ అవకాశం ఇవ్వాలని వినతి పత్రాలు ఇస్తున్నారు. 


తాజాగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి చంద్రబాబును కలిశారు. తాను త్వరలో తెలుగుదేశంలో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో టీడీపీనీ బలోపేతం చేస్తామని కూడా ప్రకటించారు. ఐతే తీగల కృష్ణారెడ్డికి చంద్రబాబు నుంచి పెద్ద హామీ ఏదో లభించిందని పార్టీలో గుసగుసలు వినపబడుతున్నాయి. అంతే కాదు తీగల కృష్ణారెడ్డికి తెలంగాణ టీడీపీ శాఖ అధ్యక్షుడిగా చంద్రబాబు హామీ ఇచ్చారా అన్ని చర్చ కూడా పార్టీలో తెగ జరుగుతుంది. గతంలో హైదరాబాద్ నగర మేయర్ గా పనిచేసిన అనుభవం ఉన్న తీగలకు అధ్యక్షుడుగా బాధ్యతలు ఇస్తే బాగుంటుందని బాబు ఆలోచనగా తెలుస్తుంది. అంతే కాదు ఆర్థికంగా  కూడా తీగల చాలా బలంగా ఉన్నాడు. పార్టీనీ నడిపించగ సమర్థుడు అనేది బాబు ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తీగల కృష్ణారెడ్డికే అధ్యక్షుడి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీలో చర్చ జోరందుకుంది. వీరితో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా చంద్రబాబును కలిశారట. అందులో సెటిలర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా చంద్రబాబును కలిసి అధ్యక్షుడి ప్రతిపాదన తెచ్చారట. కానీ చంద్రబాబు నుంచి సరైన స్పందన రాలేదట. 


ఐతే తెలంగాణ తెలుగుదేశం వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని అతి త్వరలోనే పార్టీ నేతలతో సమావేశమై పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై స్పష్టత ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉండడం వల్ల కొంత సమయాన్ని కేటాయించడం లేదని త్వరలో టీటీడీపీ కూడా సమయం కేటాయిస్తామని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారని సమాచారం. ఈలోగా పార్టీలోకి వస్తారనుకుంటున్నవారితో చర్చల ప్రక్రియ కొనసాగించాలని బాబు అనుకుంటున్నారట. చేరికలను కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని బాబు అనుకుంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. 


జీహెచ్ఎంసీ ఎన్నికల్లలోపే తెలంగాణ టీడీపీనీ ఒక గాడిలోకి పెట్టాలన్నది బాబు ఆలోచనట.ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే దాని ప్రభావం తెలంగాణ మొత్తం ఉంటుందని. పార్టీ శ్రేణులు కూడా మరింత ఉత్సాహంగా పని చేస్తాయనేది బాబు వ్యూహమట. ఒక్కసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటితే ఇక తెలంగాణలో మరింత దూకుడుగా వెళ్లవచ్చు అనేది బాబు భావిస్తున్నారని సమాచారం.


ఇలా మొత్తానికి తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుపై కోటి ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు నిర్ణయం కోసం తెలంగాణ నేతలు ఎదురు చూస్తున్నారట. ఒక్క సారి బాబు నిర్ణయం తీసుకున్నాక పార్టీనీ ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళుతామని నేతలు చెబుతున్నారు. మరి చంద్రబాబు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు..? టీటీడీపీ ఎప్పుడు యాక్టివ్ గా మారుతుందో అనేది మాత్రం వేచి చూడాలి.


Also Read: Money Scheme For Women: మోదీ ప్రభుత్వం అందిస్తున్న రూ. 2 లక్షలు కావాలా..అయితే ఇలా అప్లై చేసుకుంటే వెంటనే లభించడం ఖాయం..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి