Telangana Elections: రాజకీయ నేతలు ఏం చేసినా, ఏం మాట్లాడినా అందులో పొలిటికల్ ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ వ్యూహాల్లో దిట్టగా చెప్పుకునే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసే ప్రతి అడుగుకు బలమైన కారణం ఉంటుందని చెబుతారు. ప్రగతి భవన్ లేదా ఫాంహౌజ్ తప్ప జనాల్లోకి ఎక్కువగా వెళ్లరనే విమర్శలు ఉన్న కేసీఆర్.. కొంత కాలంగా రూట్ మార్చారు. జోరుగా జిల్లాలు చుట్టేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచారు. కొత్త స్కీంలకు ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ తీరుతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా అన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒకే రోజు మంత్రివర్గ సమావేశం, పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ సమావేశాలు లేకున్నా ఎంపీలను కూడా సమావేశానికి పిలవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం జోరుగా నడిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగబోవనని చెబుతూనే సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  తాజా సర్వే వివరాలను నేతల ముందు ఉంచారు. ఈసారి కూడా సిట్టింగులకే టికెట్లు ఇస్తానని చెప్పారు. తాను చేయించిన సర్వేలో కొందరు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని చెప్పారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ కు  72 నుంచి 80 సీట్లు వస్తాయని తెలిపారు కేసీఆర్. ఇంకొంచెం కష్టపడితే 90 నుంచి 100 సీట్లు సాధించడం ఖాయమన్నారు. నియోజకవర్గాలవారీగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను ఎమ్మెల్యేలకు అందించారు కేసీఆర్. అంతేకాదు నేతలంతా హైదరాబాద్ విడిచి వెళ్లాలని కేసీఆర్ ఆదేశించారని తెలుస్తోంది. నియోజకవర్గంలోనే ఉండాలని, ప్రజలతో మమేకం కావాలని గట్టిగా చెప్పారని సమాచారం. జనాలతో  వన భోజనాలు చేయండి. దళితబంధు, ఆసరా పింఛన్లు సహా ప్రభుత్వ పథకాలు అందుతున్న లబ్ధిదారులను కలిసి ప్రభుత్వ పనులను వివరించాలని సూచించారట కేసీఆర్.


పార్టీ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో ముందస్తు లేదంటూనే.. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముందస్తుకు వెళ్లబోతున్నారు కాబట్టే.. నేతలను నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారని అంటున్నారు. దళిత బంధు పథకాన్ని తమ అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తున్న కేసీఆర్.. ప్రతి నియోజకవర్గంలో మరో ఐదు వందల మందిని ఎంపిక చేయాలని ఆదేశించారు. ఇక సొంత ఖాళీ స్థలం ఉన్న జనాలు ఇంటిని నిర్మించుకోవడానికి 3 లక్షల రూపాయల సాయం అందించే పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారట. ఈ రెండు పథకాలను వీలైనంత త్వరగా పట్టాలెక్కించి.. ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. 2014 ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ కేసీఆర్ కు కలిసొచ్చింది. 2018లో రైతు బంధు వల్లే కేసీఆర్ కు తిరిగి అధికారం వచ్చిందనే టాక్ ఉంది. ఈసారి కొత్త హౌజింగ్ స్కీమ్ తో పాటు దళిత బంధు తమను గట్టెక్కిస్తాయనే నమ్మకంతో గులాబీ బాస్ ఉన్నారంటున్నారు. అందుకే ఈ రెండు పథకాలపై ఆయన ఫోకస్ చేశారని తెలుస్తోంది.


పార్టీ సమావేశంలో బీజేపీ టార్గెట్ గానే కేసీఆర్ మాట్లాడటంతో వచ్చే ఎన్నికల్లో తమకు కమలం పార్టీ నుంచి పోటీ ఉంటుందనే సంకేతం కేసీఆర్ ఇచ్చారని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడం ఖాయమని కూడా చెప్పడంతో.. త్వరలోనే ఆ దిశగా అడుగులు పడనున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా పార్టీ నేతలను జనాల్లోకి వెళ్లాలని ఆదేశించడం ద్వారా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్లే అంటున్నారు. విపక్షాలను గందరగోళంలో పడేయటానికే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని చెబుతూ.. కేసీఆర్ మాత్రం తన గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతున్నారని అంటున్నారు. పీకే టీమ్ ద్వారా సర్వేలు చేయిస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారని అంటున్నారు. ఇతర పార్టీల్లోకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్లకుండా అపడానికే సిట్టింగులకే సీట్లు అని ప్రకటన చేశారని భావిస్తున్నారు. 2018లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమంటూనే అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేసిన విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు.


Read Also: Amit Shah meeting: అమిత్ షా మీటింగ్‌కి కేసీఆర్, జగన్ డుమ్మా.. వై దిస్... ?


Read Also: Bandla Ganesh vs Jr NTR: బండ్ల గణేష్-ఎన్టీఆర్ మధ్య అసలు వివాదం ఏమిటో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి