అసెంబ్లీలో సీఎం సుదీర్ఘ ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రతిపక్షాలు అడిగిన అనేక ప్రశ్నలకు ఓపికగా వివరణ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రతిపక్షాలు అడిగిన అనేక ప్రశ్నలకు ఓపికగా వివరణ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న, చేయబోతున్న కార్యక్రమాలు, పథకాల గురించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు.
రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు- నూతన పాలన వ్యవస్థ
రాష్ట్రంలో జిల్లాల పెంపు ప్రజల సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయమే తప్ప, అంతకు మించి వేరే ఉద్దేశం లేదని సీఎం కేసీఆర్ శాసన సభలో ప్రకటించారు. తెలంగాణలో జరిగిన జిల్లాల పునర్విభజన దేశంలోనే అతిపెద్ద సంస్కరణ. భూ ప్రక్షాళన అనంతరం రెవిన్యూ గ్రామాలను పునర్ వ్యవస్థీకరిస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని, రాష్ట్రంలో ఐఏఎస్ ల సంఖ్యను పెంచాలని కేంద్రాన్ని కోరామని సభలో కేసీఆర్ గుర్తుచేశారు.
గ్రామ పంచాయితీల విస్తరణ
త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయితీల విస్తరణ చేపట్టుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 5 వేల కొత్త గ్రామపంచాయతీలు, 15 లేదా 20 వరకు మునిసిపాలిటీల ఏర్పాటుకు శ్రీకారం చేపట్టుతామని అన్నారు. ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.
2024 లో తెలంగాణ బడ్జెట్ రూ. 5 లక్షల కోట్లు
2024 కల్లా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.5 లక్షలకు చేరుతుంది. మన రాష్ట్రం యావత్ దేశంలోనే ఆర్థిక ప్రగతిలో ముందుంది. ఇలాంటి రాష్ట్రంలో పేదలు ఉండటానికి వీల్లేదు. ఇప్పటికే నిలువ నీడలేనివారికి ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. వారి అభివృద్దే లక్ష్యంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టుతాం.
ఎస్సీ, ఎస్టీలపై ప్రత్యేక దృష్టి
ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వారికోసం రూ. 88.71 కోట్లు కేటాయించాము. వారికోసం కేటాయించిన ప్రతి పైసా వారికే ఖర్చు చేస్తాము. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే తాట తీస్తాం అని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, అవసరమైతే మరిన్ని రూపొందిస్తామని అన్నారు.
జోన్ల మార్పు ఉండవచ్చు
తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కుటుంబాలు 14 జిలాల్లో ఉన్నాయి. 3 లక్షల కుటుంబాలు 10 జిలాల్లో ఉన్నాయి. అలాగే 4 లక్షల కుటుంబాలు గల జిల్లాలు నాలుగు ఉన్నాయి. జోన్లను రాష్ట్రానికి అనుకూలంగా మార్చుకుంటే రాష్ట్ర ఆర్థికప్రగతి బాగుంటుందని కోరారు.
త్వరలో 12 కొత్త గనులు
సింగరేణిలో త్వరలో 12 కొత్త గనులను ప్రారంభించబోతున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇందులో ఆరు భూగర్భ, మరో ఆరు ఉపరితల గనులని వెల్లడించారు. తాను వచ్చే నెల డిసెంబర్లో స్వయంగా ఒక గనిని ప్రారంభిస్తానని చెప్పారు. అక్కడి స్థానిక యువతకు ఉద్యోగం కల్పించేందుకు రెండు లేదా మూడు స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ను ప్రారంభిస్తామని, వీలుంటే అందులో ఒకటి తానే ప్రారంభిస్తానని సీఎం తెలిపారు.
ప్రపంచ తెలుగు మహా సభ
రాష్ట్ర ఘనతను, తెలంగాణ సంస్కృతి కళావైభవాన్ని ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహా సభలను డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఘనంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. తెలుగు సాహితీ ప్రక్రియలకు, జానపద జీవధారలకు తెలంగాణ పుట్టినిల్లు వంటిదని అన్నారు. భాషా ప్రేమికులు, కవులు పాల్గొని సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.