Telangana Politics: కేసీఆర్ Vs రేవంత్.. ఒక రాష్ట్రం.. ఇద్దరు తల్లులు!
Telangana Politics: ఏదైనా రాష్ట్రానికి ఒక తల్లి మాత్రమే ఉంటారు. అలాగే రాష్ట్ర గీతం కూడా ఒకటే ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే సంస్కృతి నడుస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం పరిస్ధితులు ఇందుకు విరుద్దంగా కనిపిస్తున్నాయి. ఒక రాష్ట్రానికి ఇద్దరేసి తల్లులు ఏంటనే ఆసక్తికర చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతోంది. గతంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ సంస్కృతి లేదా..! ఇప్పుడు రేవంత్ సర్కార్ ఆవిష్కరించబోతున్న విగ్రహంలో అసలైన తెలంగాణ తల్లి ఉన్నారా.. ఇంతకీ తెలంగాణలో తల్లి విగ్రహంపై రెండు పార్టీల వాదనలు ఎలా ఉన్నాయి..!
Telangana Politics: తెలంగాణ ప్రజలను ఇప్పుడు ఓ టాపిక్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. డిసెంబర్ తొమ్మిది నాడు రాష్ట్రంలో ఏం జరగబోతోంది అని ప్రజలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 9వ తేదీకి ఏడాది పూర్తవుతోంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. పదేళ్ల నాడే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది. అయితే ఇప్పుడు కొత్తగా రేవంత్ సర్కార్ మరోసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్తగా మరోసారి ఆవిష్కరించేందుకు సిద్దమవుతోంది. అయితే ఒక రాష్ట్రంలో ఒకే తల్లి ఉండగా.. తెలంగాణలో మాత్రం ఇద్దరు తల్లులు ఏంటని ఆసక్తకర చర్చ జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయ్యి దాదాపు పదేళ్లు దాటింది. గత బీఆర్‌ఎస్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పటికే ఆవిష్కరించింది. వీటితో రాష్ట్రానికి ఓ కొత్త గీతం, రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌ను టీఎస్‌గా ప్రకటించింది. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ సమాజం పూర్తిగా కేసీఆర్ ఆవిష్కరించిన తల్లి విగ్రహాన్ని అనేక చోట్ల ఏర్పాటు చేసుకుంది. అలాగే జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సర్కార్ మారడంతో.. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ సర్కార్ ఏర్పాటు చేయబోతోంది. ఇంతకుముందు ఉన్న గీతాన్ని సైతం రేవంత్ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. దాంతో ఒక రాష్ట్రంలో ఇద్దరేసి తల్లులు ఏంటని ఆసక్తికర చర్చ జరుగుతోందట.. ఈ ఇద్దరు తల్లుల్లో ఎవరు కరెక్ట్ అనే కన్‌ఫ్యూజన్‌కు ప్రజలు గురవుతున్నారని తెలుస్తోంది.
ఇక రేవంత్ రెడ్డి సర్కార్ సెక్రటేరియట్‌లో డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే సెక్రటేరియట్‌లో విగ్రహా ఏర్పాటుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. అటు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్దం చేయిస్తున్నారు. అయితే ఇప్పటికే ఓ తల్లి ఉండగా.. కొత్తగా కాంగ్రెస్ పార్టీ మరో తల్లిని ఎందుకు సృష్టించడం ఏంటని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. అయితే తెలంగాణ తల్లిలో కల్వకుంట్ల కవిత పోలికలు ఉన్నాయని.. అంతేకాదు తెలంగాణ తల్లి అంటే.. రాణిగారు కాదని.. తెలంగాణ ప్రజల ప్రతీకగా ఉండాలని అంటున్నారు. అందుకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నామని చెబుతున్నారు.
కాంగ్రెస్ సర్కార్ వాదన ఇలా ఉంటే.. బీఆర్‌ఎస్ మాత్రం తెలంగాణ తల్లి విగ్రహా మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రేవంత్ రెడ్డి కొత్తగా తయారు చేయిస్తున్న విగ్రహంలో సోనియా గాంధీ పోలికలు ఉన్నాయని విమర్శిస్తోంది. గతంలో కేసీఆర్ ఎన్నో చర్చలు, సంప్రదింపుల తర్వాత.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకే ఇలాంటి ప్రతీకార చర్యలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి చర్యకు ప్రతిచర్యగా మేడ్చల్‌లో అదేరోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని అంటున్నారు. అయితే రెండు పార్టీలు ఎవరికి వారు తెలంగాణ తల్లుల విగ్రహా ఏర్పాటు నిమగ్నం కావడంతో ప్రజలు మాత్రం కన్‌ఫ్యూజన్‌కు గురవుతున్నారు.
మరోవైపు రాష్ట్ర గీతంపైన వివాదం నడుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర గీతంగా జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే గతంలో ప్రకటించిన పాతపాటనే ఆలపిస్తామని బీఆర్‌ఎస్ పార్టీ అంటోంది. అటు వాహనాల నెంబర్ ప్లేట్ల అంశంలోనూ రెండు పార్టీలు ఎక్కడ తగ్గడం లేదు. టీజీని కంటిన్యూ చేస్తామని కాంగ్రెస్ అంటుంటే.. బీఆర్‌ఎస్ మాత్రం తాము అధికారంలోకి రాగానే టీఎస్‌గా మళ్లీ మారుస్తామని అంటోంది. అయితే తెలంగాణ విషయంలో రెండుపార్టీలు ఎవరికి నచ్చినా రీతిలో వాళ్లు వ్యవహరిస్తుండటంపైన ఉద్యమకారులు మండిపడుతున్నారు..
మొత్తంగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో రెండు పార్టీల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త విగ్రహాలకు తెరతీస్తుంటే.. రాష్ట్ర పరువు పోవడం పక్కా అంటున్నారు. ఒక రాష్ట్రానికి ఒక తల్లి చాలని.. ఇలా ఇద్దరేసి తల్లులు అవసరం లేదని రెండు ప్రభుత్వాలకు చురకలంటిస్తున్నారు.. మొత్తంగా ఈ అంశానికి ఎండ్ కార్డ్ పడేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు..
Also Read: BJP Telangana: మంత్రి ఉత్తమ్ దెబ్బకు.. బీఆర్‌ఎస్ కుదేలు..!
Also Read: Konda Surekha: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. ఈ సారి ఏంచేశారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.