Warangal MP Seat: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న `కడియం` రాక.. ఎంపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కొత్త `తలనొప్పి`
Local Leaders Objected Kadiyam Srihari Kavya Tour: అనూహ్యంగా పార్టీ మారి కాంగ్రెస్‌లో టికెట్ పొందిన కడియం శ్రీహరికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అతడి రాకపై కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకుంటుండడంతో వరంగల్ ఎంపీగా కడియం కావ్య గెలుపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Warangal Lok Sabha: తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ లోక్‌సభ స్థానం పోరు ఆసక్తికరంగా మారింది. పోరాటాల గడ్డ.. పోరుగల్లుగా ఖ్యాతి చెందిన వరంగల్‌లో రాజకీయాలు హాట్‌హాట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ వరంగల్ ఎంపీ అభ్యర్థి దొరకలేదు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని పార్టీలోకి చేర్చుకుని అతడి తనయ కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వివాదాస్పదమైంది. ఇప్పటికే ఉన్న అసంతృప్తులకు ఆజ్యం పోసింది. తాజాగా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో జరిగిన సంఘటన అదే కోవకు చెందుతుంది.
Also Read: Kadiyam Srihari: కేసీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. ఇదే నా ...
కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ టికెట్ దక్కించుకున్న అనంతరం కడియం శ్రీహరి, కావ్యలు సొంత నియోజకవర్గం స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించారు. లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో గురువారం జరిగిన సమావేశం తీవ్ర రసాభాసగా మారింది. కడియం పార్టీలో చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న శనగపురం ఇందిర, దొమ్మాటి సాంబయ్య వర్గాలు ఈ సమావేశంలో గొడవకు దిగారు. కడియం రాకను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కడియం అనుచరులు, మద్దతుదారులను పార్టీలో చేరొద్దని కొందరు వ్యతిరేకించారు. ముఖ్యంగా జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి రాకను తప్పుబడుతూ నిరసన చేపట్టారు. ఇది తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఒకరినొకరు ఫ్లెక్సీలు చించుకునే పరిస్థితికి చేరింది. ఈ సమావేశంలో ప్రసంగించకుండానే కడియం శ్రీహరి, కావ్య వెళ్లిపోయారు.
Also Read: KT Rama Rao: కాంగ్రెస్ అభ్యర్థిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. 'పనికి రాని చెత్త'గా అభివర్ణన
ఇంతలా కాంగ్రెస్ పార్టీలో కడియం చేరిక కాక రేపింది. వాస్తవంగా వరంగల్ లోక్‌సభ సీటుకు తీవ్ర పోటీ ఏర్పడింది. అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 42 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో శనగపురం ఇందిర, దొమ్మాటి సాంబయ్య కూడా ఉన్నారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న వీరిద్దరూ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే అనూహ్యంగా తమ ప్రత్యర్థి అయిన కడియం కుటుంబాన్ని పార్టీలోకి ఆహ్వానించడం పార్టీలో ప్రకంపనలు రేపింది. ముఖ్యంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా సింగపురం ఇందిర ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. తన ప్రత్యర్థి అయిన కడియం రాకను మొదటి నుంచి ఇందిర వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రోజులుగా బహిరంగంగానే కడియం చేరికపై విమర్శలు చేస్తున్నారు. కడియం కావ్యకు సహకరించేది లేదని చెబుతున్నారు.
వాస్తవంగా కడియం శ్రీహరి కూడా బలవంతంగానే కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీని వీడిన అనంతరం కడియం చేసిన వ్యాఖ్యలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 'బీఆర్‌ఎస్ పార్టీని వీడడం బాధగా ఉంది. కేసీఆర్‌పై ఎలాంటి విమర్శలు చేయను. ఆయనంటే నాకు చాలా గౌరవం. నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు' అని కడియం పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ ఒత్తిడి మేరకు పార్టీ ఫిరాయించారని భావించవచ్చు. తన కుమార్తెను ఎంపీగా చేసుకునేందుకు కడియం పార్టీ మారారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో చాలా మంది నాయకులు ఉన్నారు. వారందరినీ కాదని పార్టీలో చేరిన కడియం కావ్యకు టికెట్ కేటాయించడం రచ్చ రేపింది. చాలా నియోజకవర్గాల్లో కడియం కుటుంబానికి చాలా మంది సహకరించేందుకు ముందుకు రావడం లేదు. స్థానిక నాయకుల తీరుతో విబేధాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే నెల్లుట్ల గ్రామంలో జరిగిన వివాదం ఒకటి. మరికొన్ని రోజుల్లో ఇతర నియోజకవర్గాల్లో కూడా కడియం కుటుంబానికి ప్రతిఘటనలు ఎదురుకావొచ్చు. మరి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కడియం కుటుంబానికి సహకరిస్తారా? ఎంపీగా గెలిపించేందుకు కష్టపడతారా అనేది సందేహాస్పదంగా ఉంది. ఎంపీగా కావ్యను గెలిపించుకోకపోతే మాత్రం కడియం శ్రీహరిపై కాంగ్రెస్‌లో తీవ్ర విమర్శలు ఎదురయ్యే అకాశం ఉంది. కడియం రాజకీయ భవిష్యత్ లోక్‌సభ ఎన్నికలతో ముడిపడి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter