తెలంగాణలో పర్యటించనున్న కాంగ్రెస్ బాస్ రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలోనే తెలంగాణలో పర్యటించునున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో అధికార పార్టీని విమర్శిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ తెలంగాణ రానున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. ఇదే పర్యటనలో భాగంగా ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారని ఆయన చెప్పారు. అయితే, ప్రస్తుతానికి రాహుల్ గాంధీ పర్యటన తేదీ ఇంకా ఖరారవలేదని, రంజాన్ పండగ తర్వాతే ఈ పర్యటన ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఢీకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడిని తెలంగాణలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో జోష్ తీసుకురావాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల పిలుపు మేరకే రాహుల్ గాంధీ ఈ పర్యటనకు అంగీకరించినట్టు సమాచారం. ఈ సభలో జేఏసీ నేతలు, ఉస్మానియా యూనివర్సిటీ సంఘాల విద్యార్ధినేతలు, నిరుద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా ప్రస్తుతం ఉన్న ఆర్‌సీ కుంతియా స్థానంలో పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం కర్ణాటక బాధ్యతలు నిర్వర్తిస్తున్న గులాం నబీ ఆజాద్‌ను నియమించే అవకాశాలు కూడా లేకపోలేదని అన్నారు.