తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభ బరిలో అజారుద్దీన్
గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో మొహమ్మద్ అజారుద్దీన్‌ని బరిలోకి దించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ ఏంటి ?
తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నుకోవాల్సిన రాజ్యసభ సభ్యుని పేరుని ఖరారు చేసేందుకు జరిగిన సీఎల్పీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్థి కోసం ప్రముఖ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్, రవీంద్ర నాయక్, గూడూరు నారాయణరెడ్డి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. దాదాపు 3 గంటలపాటు జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెలంగాణలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకుగాను ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీలో వివిధ పార్టీలకు వున్న బలబలాల ప్రకారం రెండు రాజ్యసభ స్థానాలను అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ చేజిక్కించుకునే అవకాశం ఉంది. మూడవ స్థానాన్ని సైతం టీఆర్‌ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం సహాయంతో గెలుచుకునే అవకాశం లేకపోలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, 2014లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 21 స్థానాల్లో గెలుపొందినప్పటికీ.. వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పారు. మరో ఇద్దరు సభ్యులు మృతి చెందడంతో ఆయా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలవగా, టీఆర్ఎస్ ఆ స్థానాలను సొంతం చేసుకుంది. దీంతో ఇక అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి మిగిలింది 12 మంది సభ్యుల మద్దతు మాత్రమే.
ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఈ మాత్రం సంఖ్యతో రాజ్యసభ సీటు గెలవడం సైతం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, జాతీయ పార్టీగా, ఒకప్పుటి అధికార పార్టీగా పోటీ చేయకుండా వుంటే.. అటు పార్టీలో, ఇటు ప్రజల్లో పార్టీపై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం వుందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడి ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇది చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సిన సమయం కనుక హైదరాబాద్‌తో అనుబంధం వున్న మొహమ్మద్ అజారుద్దీన్‌ని బరిలోకి దింపేయోచనలో కాంగ్రెస్ పార్టీ వున్నట్టు సమాచారం.