Smita Sabharwal : స్మితా సభర్వాల్ ట్వీట్ పై రచ్చ.. సారీ చెప్పి డిలీట్ చేసిన ఐఏఎస్
Smita Sabharwal : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్. సామాజిక సమస్యలపై ఆమె ఎక్కువగా స్పందిస్తుంటారు. ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా స్మితా సభర్వాల్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Smita Sabharwal : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్. సామాజిక సమస్యలపై ఆమె ఎక్కువగా స్పందిస్తుంటారు. ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో ఆమె చేసిన కొన్ని ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి. తాజాగా స్మితా సభర్వాల్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో వివాదంగా మారింది. ఆమెను సమర్ధిస్తూ కొందరు.. వ్యతిరేకిస్తూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే దేశానికి సంబంధించిన విషయం కావడం.. కొందరు తీవ్రమైన కామెంట్లు పెడుతుండటంతో ఆమె సారీ చెబుతూ తన ట్వీట్ ను డిలీట్ చేశారు.
దసరా పండుగ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో స్త్రీ, పురుష నిష్పత్తిని తెలిపే భారత మ్యాప్ ను స్మితా సభర్వాల్ పోస్ట్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో అమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తాం.. కానీ.. స్త్రీ, పురుష నిష్పత్తి మాత్రం రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉందన్న ఈ మ్యాప్ ఆసక్తికరంగా ఉందని ఆమె ఆ ట్వీట్ లో చెప్పారు. స్మితా సభర్వాల్ పోస్ట్ చేసిన మ్యాప్ లో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో పురుషులతో పోలిస్తే మహిళల జనాభా తక్కువ ఉంది. అయితే స్మిత పోస్ట్ చేసిన మ్యాప్ లో కశ్మీర్ సంపూర్ణంగా లేదని కొందరు నెటిజన్లు ఆరోపించారు. స్మితను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టారు. తన పోస్టుపై విమర్శలు రావడంతో తొలగించారు స్మితా సభర్వాల్. క్షమాపణలు కూడా చెప్పారు.
తన పోస్టును స్మితా సభర్వాల్ డిలీట్ చేసినా ఆమెకు మద్దతుగా కొందరు కామెంట్లు చేశారు. స్మిత పోస్ట్ చేసిన మ్యాప్ తప్పు కావచ్చు కానీ.. ఆమె భావన చాలా గొప్పదని ప్రశంసించారు. ఆమె ట్వీట్ ను ఒకసారి మానవత్వంతో గమనించాలని కొందరు సూచించారు. మ్యాప్ తప్పుగా ఉందని తెలిసిన వెంటనే సారీ చెప్పి తొలగించారని.. అది అమె గొప్పతనమని కొందరు కామెంట్ చేశారు. ఈ విషయంలో తనకు సపోర్ట్ చేసినవారందరికి కృతజ్ఞతలు చెప్పారు స్మితా సభర్వాల్.
ఆగస్టులోనూ స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్ వివాదస్పదమైంది. బిల్కిస్ బానో కేసు దోషులను యూపీ సర్కార్ రిలీజ్ చేయడంపై సభర్వాల్ ట్వీట్ ద్వారా స్పందించారు.“ఒక మహిళగా.. సివిల్ సర్వెంట్‌గా, నేను #BilkisBanoCase వార్తలను చదువుతూ అవిశ్వాసంతో కూర్చున్నాను..భయం లేకుండా స్వేచ్చగా ఊపిరి పీల్చుకునే ఆమె హక్కును మనం మళ్లీ కొట్టివేయలేము. అయితే, మనల్ని మనం స్వేచ్ఛా దేశంగా చెప్పుకోలేమంటూ ట్వీట్ చేశారు. బిల్కిస్ బానో తరపున విడుదల చేసిన ఒక ప్రకటనను కూడా జత చేశారు. ఈ ట్వీట్‌పై రాజకీయ నేతలు, నెటిజన్ల నుంచి తీవ్ర స్పందన వచ్చింది. సెలెక్టివ్ గా రాజకీయ వ్యాఖ్యలు చేసినందుకు కొందరు స్మితపై కామెంట్ చేశారు.గుజరాత్ ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే ఏకైక సివిల్ సర్వెంటని మరికొందరు ప్రశంసించారు.