ఆదిలాబాద్‌: తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌కు మద్దతు విరమించుకుంటున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె చేపట్టడానికి ముందు టీఆర్‌ఎస్ పార్టీ తమ మద్దతు కోరినప్పుడు వారికి ఓకే చెప్పిన మాట వాస్తవమే కానీ.. ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చాడ తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకూ వారికి మద్దతుగా ఉండి వారి తరపున ప్రభుత్వంతో పోరాడుతామని చాడ వెంకట రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం చాడ వెంకట రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఆర్టీసీ కార్మికులు ఏమీ ఆంధ్రోళ్లు కాదని.. ఇకనైనా వారిపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు చాడ వెంకట రెడ్డి హితవు పలికారు. సమ్మె కారణంగా మనోవేదనకు గురై ముగ్గురు కార్మికులు మృతి చెందారని, వారి చావులకు కేసీఆరే బాధ్యత వహించాలని చాడ డిమాండ్‌ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిన్నవాడైనా.. ఆయన అడుగుజాడల్లో సీఎం కేసీఆర్‌ నడుచుకోవాల్సిన అవసరం ఉందని చాడ పేర్కొన్నారు. అనంతరం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.