Dalita Bandhu scheme review meeting: హైదరాబాద్: దళిత బంధు స్కీమ్ అమలు గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు ఎలాగైతే ఉద్యమం కొనసాగించామో.. అలాగే చివరి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం లబ్ధి (Dalita Bandhu Scheme beneficiaries) చేకూరే వరకు దళిత బంధు పథకం కూడా ఒక ఉద్యమం తరహాలోనే కొనసాగుతుంది అని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అంతేకాకుండా దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. తన చివరి రక్తపు బొట్టు వరకు దళితుల సంక్షేమం కోసమే కృషి చేస్తానన్న ఆయన.. దళిత బంధు పథకం గురించి ప్రజల్లోకి తీసుకుని వెళ్లి దళితుల అభ్యున్నతికి పాటు పడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నారు. ముఖ్యంగా మేధావులు ఈ బాధ్యతను తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో దళిత బంధు పథకం మరో ఉద్యమంలా మారుతుంది. దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుకు వేదికగా నిలిచిన హుజూరాబాద్ క్షేత్రం శిక్షణకు వేదిక అవుతుంది అని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దళితుల ఓట్ల కోసమే దళిత బంధు పథకం ప్రవేశపెట్టినట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. దళిత బంధు పథకం అమలు కోసం ప్రతీ ఏడాది 2 లక్షల నుంచి 3 లక్షల దళిత కుటుంబాల కోసం 20 వేల నుంచి 30 వేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో దళితుల అభివృద్ధి కోసం దశల వారీగా 1.75 లక్షల కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది అని సీఎం కేసీఆర్ (CM KCR) తెలిపారు. 


సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. 75 లక్షల జనాభా ఉంది. రాష్ట్రం మొత్తం జనాభాలో ఇది 18 శాతం. రానున్న రోజుల్లో పెరుగుతున్న దళితుల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్స్ కూడా పెంచుతాం అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో దళిత బంధు పథకంపై (Dalita Bandhu Scheme) జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


హుజురాబాద్ ఉప ఎన్నిక (Huzurabad bypolls) కోసమే దళిత బంధు పథకం తీసుకొచ్చామని అంటున్నారు కానీ వాస్తవానికి ఇది ఏడాది క్రితమే ప్రవేశపెట్టాల్సిన పథకం. కరోనావైరస్ మహమ్మారి (Coronavirus) కారణంగా ఆలస్యం అయింది. ఈ పథకం గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్నాను. తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనే దళిత చైతన్య జ్యోతి కార్యక్రమం (Dalita chaitanya jyothi program) ద్వారా దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తిని అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.