Dalita Bandhu scheme brought for Huzurabad bypolls: హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. నిజంగా దళిత జాతి సంక్షేమం కోసమే దళిత బంధు పథకం తీసుకొచ్చి ఉన్నట్టయితే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలతో (Huzurabad by election) సంబంధం లేకుండా అంతకంటే ముందే మరో వంద రోజుల్లో సంపూర్ణంగా దళిత బంధు పథకం అమలు చేయాలని  డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీఎం కేసీఆర్‌ను దళితులు రాజకీయంగా బొంద పెడుతారని మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. 


ఈ సందర్భంగా దళిత బంధు పథకం విషయంలో సీఎం కేసీఆర్ వైఖరి గురించి తీవ్ర ఆరోపణలు చేసిన మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga).. దళితులకు అవగాహన కల్పించేందుకు త్వరలోనే హుజురాబాద్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో వరద బాధితులకు రూ. 10 వేలు ఆర్థిక సాయం ప్రకటించి మోసం చేసిన సీఎం కేసీఆర్... దళిత బంధు పథకం (Dalita Bandhu Scheme) అమలు చేస్తారనే నమ్మకం తమకు లేదని అనుమానం వ్యక్తంచేశారు.