తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగలనుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. రేపు సాయంత్రం దామోదర్ రెడ్డి, కేసీఆర్‌ని ప్రత్యేకంగా కలిసి మాట్లాడతారని.. తర్వాత ఆయన సమక్షంలో పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన నాయకుల్లో దామోదర్ రెడ్డి ఒకరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక రకంగా చెప్పాలంటే ఆయనే కీలకమైన నేత. అయితే ఈ మధ్యకాలంలో పార్టీలో వస్తున్న విభేదాల పట్ల దామోదర్ రెడ్డి అయిష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా నాగం జనార్థనరెడ్డి లాంటి వారిని పార్టీలోకి ఆహ్వానించడం పట్ల దామోదర్ రెడ్డి కినుక వహిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి విభేదాల వల్లే దామోదర్ రెడ్డి పార్టీని వీడే అవకాశం ఉందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.


నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామానికి చెందిన దామోదర్ రెడ్డి నిజాం కాలేజీ నుండి బీఏ చేశారు. కాంగ్రెస్ కేడర్‌కు తెలంగాణలో అండగా ఉన్న ముఖ్యనేతల్లో ఆయన కూడా ఒకరు. 20 ఏళ్లు పార్టీకి సేవలందిస్తున్న ఆయన ఇప్పుడు టీఆర్‌‌ఎస్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారన్నది ఆలోచించాల్సిన విషయమని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.