KCR VS ETELA RAJENDER: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ అధికారంలోకి రావాలని భావిస్తోంది బీజేపీ. ఇందుకోసం అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తోంది. బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ను దెబ్బకొట్టేలా బెంగాల్ తరహాలో  వ్యూహరచన చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో సిద్దిపేట నుంచి గెలిచిన కేసీఆర్.. 2018 ఎన్నికల్లో మాత్రం గజ్వేల్ నుంచి పోటీ చేశారు. అయితే  తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ... కేసీఆర్ ను నేరుగా టార్గెట్ చేయాలని డిసైడైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. బెంగాల్ తరహాలో సువేందు అధికారిలా తాను కేసీఆర్ పై విజయం సాధిస్తానని చెప్పారు. కేసీఆర్ ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన శని పోతుందన్న రాజేందర్.. అందుకే తానే గజ్వేల్ లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని తాను ముందే చెప్పానని చెప్పారు. కేసీఆర్ ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత సంవత్సరం జరిగిన పశ్చిమ బెంగాల్ లో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఎంసీ మరోసారి గెలిచింది. కాని నందిగ్రామ్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోయారు. మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించారు. అలాంటి సీన్ తెలంగాణలోనూ రిపీట్ అవుతుందన్నారు ఈటల రాజేందర్.  


తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి పని చేశారు ఈటల రాజేందర్. హుజురాబాద్ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీ టీఆర్ఎస్ ఎల్పీ నేతగా పని చేశారు. అయితే 2018లో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాకా మొదట కేబినెట్ లోకి ఈటలను తీసుకోలేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన ప్రాధాన్యత తగ్గించారు. ఏడాది తర్వాత జరిగిన విస్తరణలో ఈటలకు చోటు దక్కినా ముందులా కీలక పోస్టు  దక్కలేదు. గులాబీ జెండాకు తామే ఓనర్లమంటూ ఓ సమావేశంలో రాజేందర్ చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి. ఆ తర్వాత కేసీఆర్, ఈటల మధ్య గ్యాప్ పెరిగింది. గత ఏడాది భూకబ్జా ఆరోపణలతో ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు కేసీఆర్. తర్వాత టీఆర్ఎస్ పార్టీకి రాజేందర్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి కేసీఆర్ ను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తూ వస్తున్నారు. బీజేపీలో చేరి కేసీఆర్ పై రివేంజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. 


తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అధికార పార్టీని ఓడించి కేసీఆర్ కు షాకిచ్చారు ఈటల రాజేందర్. తెలంగాణ వ్యాప్తంగా  ఆయన బలమైన అనుచరగణం ఉండటంతో బీజేపీ హైకమాండ్ ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన జాతీయ కార్యవర్గసమావేశాల్లో తెలంగాణపై తీర్మానం సందర్భంగా ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా మాట్లాడించారు. ఈటల చేసిన ప్రసంగానికి బీజేపీ పెద్దలంతా ఫిదా అయ్యారు. కేసీఆర్ పై యుద్ధంలో రాజేందర్ ను ప్రధాన అస్త్రంగా వాడుకోవాలి కమలం పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అందుకే జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత రోజే రాజేందర్ ను చేరికల కమిటీ కన్వీనర్ గా నియమించారు. టీఆర్ఎస్ పార్టీలోని అసమ్మతి నేతలను బీజేపీలో చేరేలా ఈటల ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తున్నారు. తాజాగా గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించి మరో సంచలనానికి తెర తీశారు. బీజేపీ హైకమాండ్ నిర్ణయంలో భాగంగానే ఈటల గజ్వేల్ లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. గజ్వేల్ లో కేసీఆర్ పోటీ చేస్తే.. కేసీఆర్ కు గట్టి పోటీ ఖాయం. మల్లన్న సాగర్ నిర్వాసితులు కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.


READ ALSO: Perni Nani: మాజీ మంత్రి పేర్నినాని నోట మరోసారి భరత్‌ అనే నేను సినిమా డైలాగ్..! 


READ ALSO:  Srilanka Crisis:శ్రీలంక మళ్లీ రణరంగం.. అధ్యక్షుడు  గొటబయ రాజపక్స పరార్..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook