KCR Condolence To Manmohan Singh: ఒకనాటి తన బాస్‌.. అనంతరం తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మరణంపై బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచారనే వార్త తెలుసుకుని తట్టుకోలేకపోయారు. వెంటనే తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మన్మోహన్‌ సింగ్‌ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూనే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్‌ సింగ్‌ పాత్రను గుర్తుచేసుకున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత.. భారతదేశం దిగ్భ్రాంతి


'భారతదేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు  చేయడం లో ఆర్థిక రంగ నిపుణుడుగా తన విద్వత్తును మన్మోహన్‌ సింగ్‌ ప్రదర్శించారు' అని మాజీ సీఎం కేసీఆర్‌ కొనియాడారు. పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ అనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దు బిడ్డ అని శ్లాఘించారు. భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్ గుర్తుచేశారు.

Also Read: Traffic E Challan: ట్రాఫిక్‌ ఈ చలాన్ల డిస్కౌంట్లు.. పోలీస్‌ శాఖ సంచలన ప్రకటన


'తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ఎత్తుగడలో భాగంగా నాటి టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకున్న పొత్తు నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వారి క్యాబినెట్ సహచరుడిగా పనిచేశా' అని కేసీఆర్‌ గతాన్ని నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. 'మితభాషిగా.. అత్యంత సౌమ్యుడుగా.. జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞత కలిగిన నాయకుడిగా.. భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్  దేశానికి అందించిన సేవలు గొప్పవి' అని కేసీఆర్‌ వెల్లడించారు.


తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్బంగా వారు అందించిన మద్దతును.. చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటని కేసీఆర్ తెలిపారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.