టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూయడంతో దుబ్బాకలో నేడు దుబ్బాక ఉప ఎన్నికలు  (Dubbaka Assembly Bypolls) జరుగుతున్నాయి. కీలక అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తుక్కాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ (TRS) అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి ఓటు వేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నేటి ఉదయం పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలలో దొంగ ఓటు కలకలం రేపింది.



 


చేగుంటలో దొంగ ఓటును గుర్తించారు. తన ఓటు ఎవరో వేశారని అసలు ఓటర్ ఆందోళన వ్యక్తం చేశాడు. అన్న వచ్చి తమ్ముడి ఓటు వేసి వెళ్లిపోయాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే తన ఓటు వేరే వ్యక్తికి ఎలా ఇచ్చారంటూ సదరు ఓటరు నిలదీశాడు. పోలింగ్ ఏజెంట్స్‌కి తెలిసే ఈ దొంగ ఓటు తతంగం జరిగిందంటూ బాధిత ఓటర్ ఆందోళనకు దిగాడు. ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారి బాధిత ఓటరుకు టెండర్ ఓటుకి అనుమతి ఇవ్వడంతో సమస్య తొలగిపోయింది.



 


సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ సమయం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశాలన్ని కల్పించనున్నట్లు పోలింగ్ అధికారులు తెలిపారు. మొత్తం 1,98,756 మంది ఓటర్లుండగా.. అందులో మహిళలు 1,00,778 మంది, పురుషులు 97,978 మంది ఉన్నారు. నేడు పోలింగ్ జరుగుతున్న ఈ స్థానంలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe