KCR: లోక్‌సభ ఎన్నికల బరిలో కేసీఆర్.. ఆ స్థానం నుంచే పోటీ..?
Lok Sabha Elections 2024: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న బీఆర్ఎస్.. ఎంపీ ఎలక్షన్‌పై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో ఎలాగూ అధికారం కోల్పోయాం కానీ కేంద్రంలో మాత్రం పట్టు కోల్పోకూడదలన్న పట్టుదలతో ఉంది. ఇందుకోసం గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలో దించేందుకు సిద్ధమవుతోంది. లెక్కలు బేరీజు వేసుకుంటూ ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న దానిపై గులాబీ బాస్ దృష్టి సారించారు.
Lok Sabha Elections 2024: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక అన్ని పార్టీలు లోక్‌సభ ఎన్నికలపై నజర్ పెట్టాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకున్న బీఆర్‌ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేలా ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. అభ్యర్థులపై కసరత్తు మొదలు పెట్టారు సీఎం కేసీఆర్. ఇప్పటికే కొంతమంది నేతలకు హామీ ఇచ్చి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని సూచించారు. అయితే కొన్ని టికెట్లకు మాత్రం ఒకరిద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్ శ్రేణులు డీలా పడ్డాయి. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపడుతుందని భావించిన గులాబీ దండు ఆశలపై కాంగ్రెస్ నీళ్లు జల్లింది. అసెంబ్లీ ఎన్నికల ఫలతాలను ఆ పార్టీ శ్రేణులు ఇంకా జీర్ణయించుకోలేకపోతున్నాయి. అయితే బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపి.. మళ్లీ పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టారు.
కేసీఆర్ ఈ సారి పార్లమెంట్ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఒక వేళ ఏదైనా కారణం వల్ల కేసీఆర్ బరిలో దిగకుంటే.. తన బదులు మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అటు జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ బరిలో దిగే అవకాశం ఉందంటున్నారు.
చేవెళ్ల నుంచి మరోసారి రంజిత్ రెడ్డినే బీఆర్ఎస్ టికెట్ వరించనుందని సమాచారం. నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కవిత పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మల్లోతు కవితతో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేరు కూడా వినిపిస్తోంది.
ఖమ్మం లోక్‌సభ స్థానానికి కూడా గట్టిపోటీ తప్పేలా లేదు. ఖమ్మం అభ్యర్థిగా బీఆర్‌ఎస్ నుంచి మరోసారి బరిలో దిగాలని సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు భావిస్తుండగా.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పేరు కూడా తెరపైకి వస్తోంది. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన పువ్వాడ అజయ్.. ఖమ్మం అసెంబ్లీ బరిలో దిగి ఓటమి పాలయ్యారు. దాంతో ఆయన్న ఎంపీగా పోటీ చేయించొచ్చన్న ప్రచారం జరుగుతోంది. నల్లొండ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డిని కానీ, ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి కానీ బరిలో దించొచ్చంటున్నారు. కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. భువనగిరి నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్, చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, బడుగు లింగయ్య యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి తలసాని కొడుకు సాయికిరణ్ కానీ దాసోజు శ్రవణ్ కానీ బరిలో దిగొచ్చంటున్నారు.
మహబూబ్‌నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్‌రెడ్డిని మళ్లీ బరిలో దింపాలా లేక వేరొకరిని పోటీలో నిలపాలా అని బీఆర్‌ఎస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ని కానీ, మరో మంత్రి నిరంజన్‌రెడ్డిని కానీ పోటీలో నిలపాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇటవల జరిగిన ఎన్నికల్లో ఈ ఇద్దరు మంత్రులు ఓటమి పాలయ్యారు. నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ రాములుతో పాటు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లేదా అతడి భార్య గువ్వల అనితకు ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు. కరీంనగర్‌లో బోయినపల్లి వినోద్ కుమార్ పేరు దాదాపు ఖరారైందంటున్నారు. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, గోడం నగేశ్‌లలో ఒకరి పోటీ చేసే అవకాశం ఉంది.
పెద్దపల్లి నుంచి ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీలో నిలిచే అవకాశం ఉంది. మల్కాజిగిరి- శంభీపూర్ రాజు, బొంతు రామ్మోహన్, ముద్దుగోని రాంమోహ్మన్‌గౌడ్, భేతి సుభాష్‌రెడ్డి, వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కడియం కావ్య పేర్లు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తారని భావించి చాలా మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఓటమి పాలయ్యారు.
ఓడిపోయిన బలమైన నాయకులను మళ్లీ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిపి గెలిపించుకోవాలన్న వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొందరు ఎమ్మెల్యేను సైతం ఎంపీ ఎన్నికల బరిలో నిలిపితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట గులాబీ బాస్. కనీసం 15 స్థానాలు దక్కించుకునేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద కేసీఆర్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.
Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter