మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో జగ్గారెడ్డి పాస్‌పోర్టు తీసుకున్నట్టు గుర్తించిన పోలీసులు.. పటాన్‌‌చెరు వద్ద ఓ కార్యక్రమంలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. జగ్గారెడ్డి నకిలీ పాస్‌పోర్ట్‌తో అమెరికా వెళ్లి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భార్యా పిల్లల పేరుతో ఇతరులను అమెరికాకు తీసుకెళ్లి వారిని అక్కడే వదిలి వచ్చారనే ఆరోపణలు జగ్గారెడ్డిపై ఉన్నాయి. 2004లో ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో జగ్గారెడ్డి తను, తన భార్య, ఇద్దరు పిల్లలు అమెరికాకు వెళ్తున్నామంటూ పాస్‌పోర్టులు తీసుకున్నారని, ఆ పర్యటన అనంతరం ఆయనొక్కరే తిరిగి వచ్చారంటూ సోమవారం ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు మానవ అక్రమ రవాణా కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. జగ్గారెడ్డి అమెరికాకు తీసుకెళ్లింది ఎవరిననే విషయమై విచారణ జరుపుతున్నారు.


కాగా.. తనపై వస్తున్న అభియోగాల్లో వాస్తవం లేదని జగ్గారెడ్డి అన్నారు. పోలీసులు మంగళవారం ఉదయం గాంధీ జగ్గారెడ్డికి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. గాంధీ ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరినీ విదేశాలకు తరలించలేదని, రాజకీయంగా దెబ్బతీసేందుకే ఎన్నికల సమయంలో తనపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌, హరీష్‌రావుపై కూడా నకిలీ పాస్‌పోర్ట్‌ కేసులు ఉన్నాయన్నారు.


కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డిని పక్కా ఆధారాలతోనే అరెస్టు చేశామని నార్త్‌ జోన్‌ డీసీపీ చెప్పారు. 2004లో ముగ్గురిని అమెరికా పంపారని, భార్యా పిల్లలంటూ పాస్‌పోర్టులు పొందారన్నారు. ఈ వ్యవహారంలో జగ్గారెడ్డికి భారీగా ముడుపులు అందాయన్నారు. ఆయనపై ఇమ్మిగ్రేషన్‌, పాస్‌పోర్టు యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పిన డీసీపీ.. ఆధార్‌ డేటా ఆధారంగా కేసును ఛేదించామన్నారు.


మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి అరెస్టు అక్రమ‌మ‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. అటు జగ్గారెడ్డి అరెస్టుతో సంగారెడ్డిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జగ్గారెడ్డిని అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ సంగారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు నేడు సికింద్రాబాద్ సిటీ సివిల్‌ కోర్టులో హాజరుపర్చనున్నారు.