Uttam Kumar Reddy Reacts About Party Changing: గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్‌ చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారం లేకుండా వార్తలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న ఓ నాయకుడు పార్టీలో తన స్థానాన్ని దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ బాంబ్ పేల్చారు. ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ఈ పుకార్లను నేను ఖండిస్తున్నాను. అవి పూర్తిగా అబద్ధం. 1994 తర్వాత ఎన్నికల్లో ఓడిపోకుండా.. 30 ఏళ్లు నిరంతరంగా కాంగ్రెస్ పార్టీకి విధేయతతో పనిచేసి.. వరుసగా 6 ఎన్నికల్లో గెలుపొందినందుకు గర్విస్తున్నాను. నా భార్య పద్మావతి రెడ్డి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉండి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తృటిలో ఓడిపోయారు. కోదాడలో ఉంటూ పీసీసీ ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ తరపున తన శక్తి మేరకు అక్కడి ప్రజల కోసం పనిచేస్తున్నారు.  


మాకు పిల్లలు లేరు.  అత్యంత నిబద్ధతతో ప్రజా జీవితంలో 365 రోజులు పని చేస్తున్నాం. పరువు నష్టం కలిగించే కథనాలతో మమల్ని లక్ష్యంగా చేసుకోవడం బాధాకరమైనది. కాంగ్రెస్ పార్టీలో నా అనుచరులను అణగదొక్కే లక్ష్యంగా ప్రచారం కూడా జరిగింది. నేను పార్టీలో పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు. కానీ జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి సంబంధించిన విధివిధానాలను అనుసరిస్తాను. అంతర్గత విషయాల గురించి బయట మాట్లాడను. 


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యపై పి.చిదంబరం అధికారిక సర్వసభ్య సమావేశంలో తప్ప ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ను కలవలేదు లేదా మాట్లాడలేదు. నాకు ఎలాంటి వ్యాపారం లేదా ఒప్పందాలు లేదా భూమి లావాదేవీలు లేవు. నా ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణలో పనిచేసినందుకు గర్వపడుతున్నా. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా పనిచేశా. ఆ తరువాత రాష్ట్రపతి వెంకటరామన్, ప్రెసిడెంట్ ఎస్‌డీ వద్ద సీనియర్ అధికారిగా పనిచేశా. 


నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా జీవితంలో ఉండేందుకు ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశా. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికవడం నా అదృష్టం.  ఉమ్మడి ఏపీకి గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాను. మేము మా జీవితంలో అన్నింటికి కాంగ్రెస్ పార్టీ సేవకు, ప్రజల కోసం అందించాం. నాకు ఏ ప్రభుత్వంతోనూ వ్యాపారం, ఒప్పందాలు, భూ ఒప్పందాలు లేవని మరోసారి పునరుద్ఘాటించాలనుకుంటున్నాను. కాంగ్రెస్ నాయకుడితో సన్నిహితంగా ఉన్న యూట్యూబ్ ఛానెల్‌లు, మీడియా సంస్థలు నా గురించి, నా భార్య గురించి తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచురించడం మాకు తీవ్ర బాధను, మనోవేదనను కలిగించింది. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారనే నిరాధారమైన, తప్పుడు కథనాలను ఖండిస్తున్నాం.." అని ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.


Also Read: Ind Vs WI 2nd Odi Updates: రెండో వన్డేలో టాస్ గెలిచిన విండీస్.. రోహిత్, విరాట్ కోహ్లీలకు రెస్ట్.. ప్లేయింగ్ 11 ఇలా..!  


Also Read: Jayasudha: బీజేపీలోకి జయసుధ..! ఎక్కడి నుంచి పోటీ అంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి