చంచల్‌గూడ జైలుకి గజల్ శ్రీనివాస్
రేడియో జాకీపై లైంగిక వేధింపులకి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో గజల్ శ్రీనివాసుకి కోర్టు జనవరి 12వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
రేడియో జాకీపై లైంగిక వేధింపులకి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో గజల్ శ్రీనివాసుకి కోర్టు జనవరి 12వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు గజల్ శ్రీనివాస్‌ని కోర్టు నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకి తరలించారు. ఈ కేసులో గజల్ శ్రీనివాస్ ఇంట్లో పనిమనిషిగా చేస్తోన్న పార్వతిని సైతం రెండవ నిందితురాలిగా చేర్చిన పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. గత రెండు నెలలుగా పనిమనిషి పార్వతి కూడా గజల్ శ్రీనివాస్ మాట విని అతడికి సహకరించాల్సిందిగా తనపై ఒత్తడి తీసుకొస్తున్నట్టుగా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకే పార్వతిని ఈ కేసులో ఏ2గా చేర్చినట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే, గజల్ శ్రీనివాస్ పనిమనిషి పార్వతి మాత్రం ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని చెబుతోంది. లైంగిక వేధింపుల కేసులో పార్వతి ఏ2గా ఆరోపణలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్ ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారురాలు చేసిన ఆరోపణలని కొట్టిపారేసిన పార్వతి... ఆమె ఆరోపిస్తున్నట్టుగా గజల్ శ్రీనివాస్ కానీ తాను కానీ అలాంటి వాళ్లం కాదు అని అన్నారు.