రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
రేషన్ డీలర్లు, హమాలీలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలసరి వేతనంతో కూడిన ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణలో రేషన్ డీలర్లు ఎప్పటి నుంచో చేస్తోన్న డిమాండ్ పై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతానికి రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనప్పటికీ.. వారికి ఇప్పటివరకు కిలో బియ్యంపై ఇస్తోన్న 20 పైసల కమీషన్ ను 70 పైసలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచే పెంచిన కమిషన్ రేటు అమలులోకి రానున్నట్టు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో జాతీయ ఆహార భద్రత చట్టం 2015 అక్టోబర్ 1 నుంచి అమలులో ఉందని, అప్పటినుంచి ఇప్పటివరకు ఉన్న బకాయిలన్నీ డీలర్లకు చెల్లించాలని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీలతోపాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల స్థానాలను సైతం భర్తీ చేయనున్నట్టు ఈటల వెల్లడించారు. ఈ మేరకు గురువారం పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కమీషన్ పెంపుతో రాష్ట్రంలోని దాదాపు 16 వేలమందికి లబ్ధిచేకూరనున్నట్టు మంత్రి వివరించారు.
రేషన్ డీలర్ల సమస్యలపై గురువారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన మంత్రులు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సభ్యులుగా ఉన్న క్యాబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న రేషన్ డీలర్ల సమస్యలపై చర్చించింది. ఈ సందర్భంగా కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి ఈటల రాజేందర్ మీడియాకు వివరించారు. రేషన్ డీలర్లకు మంచి భవిష్యత్‌ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి ఈటల స్పష్టంచేశారు చేశారు.
హమాలీలకు గుడ్ న్యూస్:
రేషన్ డీలర్ల సమస్యలతోపాటు పౌరసరఫరాలకు అనుబంధంగా పనిచేస్తోన్న హమాలీల సమస్యలపై సైతం ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. హమాలీ కూలీ రేట్లను రూ. 15.50 నుంచి రూ.18.50కు పెంచడంతోపాటు దసరా బోనస్, స్వీట్ బాక్సు చెల్లింపులు, దర్జీ చార్జీలను సైతం పెంచుతున్నట్టు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి.