సిద్దిపేట: అదేంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కంటి వెలుగు పథకం రాష్ట్ర ప్రజలకు అందరికీ వర్తిస్తుంది కానీ ఇలా కాంగ్రెసోళ్లకు అంటూ సెపరేటుగా ఉండదు కదా అని అనుకుంటున్నారా ? లేకపోతే రాజకీయ పార్టీల నేతలకు కూడా ప్రభుత్వాలే ముందుండి కంటి ఆపరేషన్స్ చేయిస్తున్నాయా అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే, మీరు పొరపడినట్టే.. ఎందుకంటే ఇదేమీ కాంగ్రెసోళ్ల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకమో లేక కార్యక్రమమో కాదు.. కాంగ్రెస్ పార్టీ నేతలపై మంత్రి హరీష్ రావు వ్యంగ్యంగా సంధించిన విమర్శనాస్త్రాల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలివి. అవును.. కాంగ్రెస్ నేతల తీరుపై మంత్రి హరీష్ రావు సంధించిన వ్యంగ్యాస్త్రాలే ''కాంగ్రెసోళ్లకు కంటి ఆపరేషన్స్'' వ్యాఖ్యలు. తెలంగాణలో ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసినా.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అభివృద్ధి జరగడం లేదని విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించే క్రమంలో ''కాంగ్రెస్‌ నాయకులకు సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి కనబడకపోవడం విచిత్రంగా ఉంది. అందుకే వారు కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సిన అవసరం ఉంది" అంటూ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ.2 కోట్లతో నిర్మించిన శ్రీకృష్ణ యాదవ భవన్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి హరీశ్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. 


సిద్దిపేట సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకే చెందిన కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ తెలంగాణలో గొల్లకురుమల సంక్షేమాన్ని చూసి ముచ్చటపడిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా గొల్లకురుమలకు సంక్షేమ ఫలాలు అందించడం జరిగిందన్నారు. అలాగే పాడిరైతులకు వారం రోజుల్లోనే లీటరుకు రూ.4చొప్పున ఇన్సెంటివ్‌ డబ్బులు మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.