హైదరాబాద్‌: బుధవారం సాయంత్రం భారీ శబ్ధాలతో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, బేగంపేట, సోమాజీగూడ, ఎర్రమంజిల్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వరద నీరు రోడ్లపైకి చేరడంతో రోడ్లన్నీ చెరువులని తలపించాయి. దీంతో అనేక చోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇంటికి తిరిగొచ్చే సమయం కావడంతో చాలామంది వాహనదారులు రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు.


హైదరాబాద్‌లో భారీ వర్షం కురవడంతోపాటు పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.