బేగంపేట్ విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వం భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. నవంబరు 28వ తేదీ నుండి ప్రారంభం కానున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు, మెట్రో రైలు ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు విచ్చేస్తున్న క్రమంలో ఆయన దిగనున్న బేగంపేట విమానాశ్రయంలో ఎస్‌పీజీ తనిఖీలు నిర్వహించారు. చుట్టు ప్రక్కల ప్రాంతాలన్నింటిలోనూ నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. లా అండ్ ఆర్డరు సమస్యలు తలెత్తకుండా దగ్గరలోని పోలీస్ స్టేషన్లు అన్నింటికీ ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ముఖ్యంగా ఎయిర్ పోర్టులో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎయిర్ పోర్టులో విమానం ల్యాండింగ్, టేకాఫ్ ప్రాంతాలను సంబంధిత అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం విమానాశ్రయంను ఎస్‌పీజీ పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తోంది.