హైదరాబాద్‌లో డిసెంబర్ 31న రాత్రి అందరూ నూతన సంవత్సరం వేడుకల్లో నిమగ్నమై వుండగా ఓ మహిళ మాత్రం తన ప్రియుడు, అతడి ఇద్దరు స్నేహితులతో కలిసి తెల్లవారేసరికల్లా కట్టుకున్న భర్తనే కడతేర్చింది. మాదాపూర్‌లో జరిగిన ఈ దారుణం సరిగ్గా మూడు రోజుల తర్వాత మరో యువకుడి ఆత్మహత్యాయత్నంతో వెలుగుచూసింది. ఇంతకీ ఆ యువకుడు ఎవరు ? ఈ హత్యతో అతడికి వున్న సంబంధం ఏంటనే కదా మీ డౌట్!! అయితే, గురువారం ఉదయం లాలాపేటలో జరిగిన నరేష్ ఆత్మహత్యాయత్నం, ఆ తర్వాతి పరిణామాల గురించి తెలుసుకోవాల్సిందే.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాలాపేటలో నరేష్ అనే యువకుడు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడిని ఆస్పత్రికి తరలించడానికన్నా ముందే యువకుడి ఆత్మహత్యాయత్నం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అతడి వాంగ్మూలం తీసుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం పోలీసులతో మాట్లాడిన నరేష్.. తన ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితుల గురించి వారికి వివరించాడు. 


నరేష్ ఇచ్చిన వాంగ్మూలం విని నిర్ఘాంతపోవడం పోలీసుల వంతైంది. అప్పటివరకు రహస్యంగా వున్న ఓ హత్యోదంతం నరేష్ వాంగ్మూలంతో బట్టబయలైంది. మూడు రోజుల క్రితం మాదాపూర్‌లో జరిగిన హత్యకు తనని బాధ్యుడిని చేయాలని అసలు నిందితులైన దీపక్ అతడి స్నేహితుడు తనని కొట్టి ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని నరేష్ పోలీసులకి తెలిపాడు.


డిసెంబర్ 31న రాత్రి స్నేహితుడు దీపక్ తనకు ఫోన్ చేసి మాదాపూర్ వెళ్లొద్దామని కోరితే అతడితో కలిసి అక్కడికి వెళ్లాను. దీపక్ అతడి ప్రియురాలితో కలిసి ఆమె భర్తను హత్య చేయడానికి ప్లాన్ చేశాడని అక్కడికి వెళ్లాకే తెలిసింది. మాదాపూర్‌లో ఓ మహిళ తన భర్తని హత్య చేయడానికి తన ప్రియుడైన దీపక్ సహాయం కోరగా.. అందుకు దీపక్ తనని, మరో స్నేహితుడిని తీసుకెళ్లాడని అక్కడికి వెళ్లాకే అర్థమైంది అని నరేష్ పోలీసులకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. " మాదాపూర్‌లో దీపక్ ప్రియురాలి కోరిక మేరకు ఆమె భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి అతడిని హత్య చేశాం. తర్వాత అతడు మృతి చెందినట్టు నిర్ధారించుకున్న అనంతరం శవాన్ని తీసుకెళ్లి నల్గొండ జిల్లాలో సాగర్ కాలువలో పడేశాం. కానీ ఇప్పుడు ఆ హత్యని తనపైకి నెట్టేయాలని దీపక్ కుట్ర పన్నుతున్నాడు'' అని నరేష్ పోలీసులకి తెలిపాడు. 


అయితే, మాదాపూర్‌లో ఓ హత్య చేశామని అంగీకరించిన నరేష్... హతుడి వివరాలు కానీ, అతడిని హత్య చేయించిన మహిళ వివరాలు కానీ చెప్పలేకపోయాడు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నరేష్ కోలుకుంటే కానీ మాదాపూర్ మర్డర్ మిస్టరీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం లేదు. నరేష్ చెప్పిన వివరాల ప్రకారం లాలాగూడ పోలీసులు మాదాపూర్ పోలీసులకి సమాచారం అందించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. అక్కడ గత మూడు రోజుల్లో ఎటువంటి మర్డర్ కేసు నమోదు కాలేదనే సమాధానమే బదులుగా వచ్చింది. కాకపోతే, మాదాపూర్ పీఎస్‌లో ఓ మిస్సింగ్ కేసు మాత్రం నమోదైందని, అదృశ్యమైన ఆ వ్యక్తి, దీపక్ చేతిలో హతమైన వ్యక్తి ఒక్కరేనా అనేది తెలియాల్సి వుందన్నారు. 


ఇదిలావుంటే, నరేష్ చెప్పిన వివరాల ప్రకారం మరోవైపు నల్గొండ పోలీసులు సాగర్ కాలువలో శవం కోసం గాలింపు చేపట్టారు. నరేష్ ఆత్మహత్యాయత్నంతో వెలుగు చూసిన ఈ క్రైమ్ కహానీలో ఇంకెన్ని ట్విస్టులు వెలుగుచూడనున్నాయో మరి!