Hyderabad Fire Accident Today: హైదారాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేటలో ఉన్న ఒక 5 అంతస్తుల భవనం మంటల్లో చిక్కుకుంది. మినిస్టర్ రోడ్డులో క్రీడలకు సంబంధించిన వస్తు, సామాగ్రి విక్రయించే స్పోర్ట్స్ స్టోర్‌లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. డెక్కన్ నైట్ వియర్ స్పోర్ట్స్ పేరిట ఉన్న ఈ స్పోర్ట్స్ స్టోర్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో అంటుకున్న మంటలు బిల్డింగ్‌లోని పై అంతస్తులకు సైతం వ్యాపించాయి. భవనంలో ఎక్కువ శాతం ప్లాస్టిక్, రెగ్జిన్, కాటన్ మేడ్ ఫ్యాబ్రిక్ క్రీడలకు సంబంధించిన వస్తు సామాగ్రి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే బిల్డింగ్‌లో మంటలు శరవేగంగా 5 అంతస్తులకు వ్యాపించినట్టు సమాచారం అందుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అగ్ని ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ఉదయం 11.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన 2 ఫైర్ ఇంజన్స్‌తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ప్రమాదం తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో మరో 5 ఫైర్ ఇంజన్లను రప్పించారు. మొత్తం 7 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే పనిలో బిజీగా ఉన్నాయి.



 


భారీ అగ్ని ప్రమాదం కారణంగా దట్టమైన మంటలు ఎగిసిపడటంతో ఆ బిల్డింగ్ పరిసరాలు మొత్తం పొగతో నిండిపోయాయి. ఫైర్ ఇంజన్స్ సైతం దూరం నుంచే మంటలను ఆర్పాల్సి వస్తోంది. స్టోర్ యజమాని చెప్పిన వివరాల ప్రకారం బిల్డింగ్‌లో నలుగురు సిబ్బంది పనిచేస్తుండగా.. ఫైర్ సిబ్బంది వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. ఒకవైపు మంటలు ఆర్పుతూనే మరోవైపు పై అంతస్తుల్లో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.