ఆర్టీసి సమ్మె నేపథ్యంలో ప్రతీ 3 నిమిషాలకు ఓ మెట్రో రైలు
ఆర్టీసి సమ్మె నేపథ్యంలో ప్రతీ 3 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడిచేలా ప్రత్యేక చర్యలు: మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేపట్టిన నేపథ్యంలో పండగలకు ప్రయాణం చేస్తున్న వారు అసౌకర్యానికి గురికాకుండా నగరంలో ప్రతీ 3 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడిచేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12:30 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని ఎన్‌వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. రాత్రి 11:30 గంటలకు చివరి రైలు బయల్దేరి, రాత్రి 12:30 గంటలకు చివరి స్టేషన్లకు చేరేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.
పండగ సెలవుల రద్దీని తట్టుకోవడానికి వీలుగా అదనపు టికెట్ కౌంటర్లు, యంత్రాలు, సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్టు ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు. రద్దీ నిర్వహణ నిమిత్తం ఎల్బీనగర్, అమీర్‌పేట్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్ ఈస్ట్, పరేడ్ గ్రౌండ్స్ వంటి ముఖ్యమైన స్టేషన్లలో మెట్రో సీనియర్ అధికారులు విధులు నిర్వర్తిస్తారని అన్నారు. పండగ సెలవులకు ఇంటికి వెళ్లే వారు, బయటికి వెళ్లే ప్రయాణికులు మెట్రో సేవలు వినియోగించుకోవాల్సిందిగా సూచించారు.