ఆ పార్కులో నడిస్తే.. ఆనందమే వేరు
నగరంలో పార్కులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించిందని, జోన్‌ల వారిగా వివిధ రకాల పార్కులను అభివృద్ది చేస్తున్నామని అధికారులు తెలిపారు.
హైదరాబాద్: నగరంలో పార్కులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించిందని, జోన్‌ల వారిగా వివిధ రకాల పార్కులను అభివృద్ది చేస్తున్నామని అధికారులు తెలిపారు. అందులో భాగంగా దోమలగూడలోని ఇందిరా పార్కు నందు ఒక ఎకరం విస్తీర్ణంలో పంచతత్వ ఆక్యూప్రెజర్ వాకింగ్ ట్రాక్ పార్కును అభివృద్ది పనులు జరుగుతున్నాయని, దాదాపు 80శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
ఆక్యూప్రెజర్ (శరీరంపై ఒత్తిడి కలిగించు) పద్దతిలో ఎనిమిది అంశాలతో ఈ పార్కును నిర్మిస్తున్నామని, ఎకరం విస్తీర్ణంలో సర్కిల్ పద్దతిలో ట్రాక్ పై నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలో ఉన్న నరాలపై వివిధ స్థాయిలో ఒత్తిడిని కలిగించే పద్దతిలో 20 ఎం.ఎం, 10 ఎం.ఎం రాళ్లు, రివర్ స్టోన్స్, 6 ఎం.ఎం చిప్స్, ఇసుక, చెట్ల బెరడు, నల్లరేగడి మట్టి, నీటి బ్లాక్‌లను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింట్ ట్రాక్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు.
ఈ సర్కిల్‌కు అన్నీ వైపులా 40 రకాల మెడిసినల్, హెర్బల్ మొక్కలను బ్లాక్‌లుగా చేసే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, మొదటగా నరాలపై అధిక ఒత్తిడి కలిగించే ట్రాక్ నుండి క్రమ పద్దతిలో ఒత్తిడి తగ్గించే ట్రాక్ వైపు నడవటం వల్ల రక్తప్రసరణలో సానుకూల మార్పు జరిగి వివిధ రకాల అనారోగ్యాలు దూరమవుతాయని, ఈ పార్కు మధ్యలో గౌతమ బుద్దుడి విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..