Munugode Bypoll: అనుకున్నది ఒక్కటి.. అవుతున్నది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అన్నట్లుగా తయారైంది ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి. సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికతో బీజేపీలో ఊపు కన్పించింది. మునుగోడులో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కషాయ కండువా కప్పుకున్న వెంటనే ఆ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. పదుల సంఖ్యలో వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా పోటీపడి మరీ కమలం గూటికి చేరారు. మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల్లో దాదాపు 90 శాతం మందిని తనతో పాటు కమలం గూటికి చేర్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అధికార టీఆర్ఎస్ నుంచి కొంత మంది నేతలను తనవైపు లాగేశారు. రాజగోపాల్ రెడ్డి దూకుడు... కాషాయ పార్టీలోకి చేరికలతో మునుగోడులో కమల వికాసం ఖాయమనే సంకేతం కన్పించింది. మునుగోడు బైపోల్ లో రాజగోపాల్ రెడ్డికి పోటీ ఉండదనే టాక్ కూడా విన్పించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతవరకు బాగానే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. జోరుగా సాగిన వలసలే కమలం పార్టీలో కుంపటి రాజేస్తోంది. కొత్తగా చేరిన నేతలతో పాత నేతల వార్ మొదలైంది. నియోజకవర్గంలోని అన్ని మండలాలు ఇంకా చెప్పాలంటే ప్రతి గ్రామంలోనూ బీజేపీలో వర్గ పోరు కనిపిస్తోంది. పాత, కొత్త నేతల మధ్య కొన్ని గ్రామాల్లో ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. పార్టీ సమావేశాలకు తమకు ఆహ్వానం అందడం లేదని, తమకు తెలియకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పాత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి పర్యటనల్లోనూ అంతా కొత్తవారే హంగామానే కనిపిస్తోంది. ఆయన పర్యటన వివరాలు కూడా పాత నేతలకు తెలియడం లేదట. పార్టీ మండల అధ్యక్షులకు కూడా రాజగోపాల్ రెడ్డి పర్యటన వివరాలు, చేరికల సంగతి తెలియడం లేదట.  దీంతో పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న తమను కాదని కొత్తగా వచ్చిన వారు పెత్తనం చేయడం ఏంటని పాత బీజేపీ నేతలు మండిపడుతున్నారట. 


మునుగోడు వర్గపోరు అంశం పార్టీ పెద్దల దృష్టికి వెళ్లిందని అంటున్నారు. పార్టీ నేతల మధ్య గ్యాప్ పెరగడంతో పాటు రాజగోపాల్ రెడ్డి తీరుపై పార్టీ పెద్దలు అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ లా ఏకపక్షంగా వ్యవహరిస్తే కుదరదని కొందరు నేతలు రాజగోపాల్ రెడ్డికి నేరుగానే చెప్పినట్లు తెలుస్తోంది.  ఇక పార్టీ చేరికల విషయంలోనూ రాజగోపాల్ రెడ్డిపై పార్టీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీ సంస్థాగత ఇంచార్జ్ సునీల్ బన్సల్ ఇటీవలే మునుగోడులో పర్యటించారు. నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేతల విభేదాలు బన్సల్ దృష్టికి వచ్చాయట. దీంతో ఇలా అయితే పార్టీకి నష్టమని ఓపెన్ గానే రాజగోపాల్ రెడ్డికి బన్సల్ క్లాస్ పీకారని తెలుస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ కేడర్ మొత్తం తనతో వస్తుందని చెప్పిన సంగతి గుర్తు చేస్తూ... చెప్పినట్లుగా కేడర్ రాలేదని బన్సల్ నిలదీశారని సమాచారం. సర్పంచ్ లు పార్టీలో చేరితే సరిపోదని.. వాళ్లతో పాటు కేడర్ కూడా రావాలని తేల్చి చెప్పారట. దీంతో తనకు నెల రోజుల సమయం ఇవ్వాలని... ఆ లోపు నేతలు, కేడర్ ను తీసుకువస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారని తెలుస్తోంది. దీంతో నెల రోజుల్లో వర్గ విభేదాలను సెట్ రైట్ చేయడంతో కేడర్ ను పార్టీలో చేర్చాలని డెడ్ లైన్ పెట్టారట బీజేపీ పెద్దలు. 


మునుగోడు ఉప ఎన్నికను ఎప్పుడు నిర్వహించాలనే విషయంలోనూ బీజేపీ పెద్దలు సుదీర్ఘ కసరత్తు చేశారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి పరిస్థితి ఇంకా  పూర్తిగా   సానుకూలంగా లేదని గ్రహించిన పార్టీ నేతలు.. కొంత సమయం వేచి చూడాలని నిర్ణయించారని తెలుస్తోంది. దీంతో దసరా, దీపావళి తర్వాతే మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది అన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. 


Read also: Munugode Bypoll: కేటీఆర్, హరీష్ రావు గ్రాఫ్ తగ్గిందా? మునుగోడులో ఒక్కో మండలానికే ఇంచార్జ్ బాధ్యతలు..


Read also: Bhatti With KCR: అసెంబ్లీలో సీఎల్పీ నేతకు సీఎం ప్రశంసలు.. రేవంత్ రెడ్డిని తొక్కేయడమే కేసీఆర్ లక్ష్యమా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook