Bhatti With KCR : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. తమ ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీలు ఎప్పటికప్పుడు స్టాండ్ మారుస్తుంటాయి. బద్ద విరుధోలుగా ఉన్న పార్టీలు సైతం మిత్రపక్షాలుగా మారిపోతుంటాయి. ఇటీవల బీహార్ లో జరిగిన పరిణామమే ఇందుకు సాక్ష్యం. అలాగే రాజకీయాల్లో శత్రువుకు శుత్రువు మిత్రుడవుతుంటారు. ఇది కూడా చాలా సార్లు రుజువైంది. బలమైన తమ ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు మరో ప్రత్యర్థిని అక్కున చేర్చుకుంటుంటారు కొందరు లీడర్లు. ప్రస్తుతం తెలంగాణలో అలాంటే సీనే కనిపిస్తోంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తుంటారు విపక్ష నేతలు. కాని తెలంగాణ అసెంబ్లీలో మాత్రం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సీఎల్పీ నేత జోలికి వెళ్లకుండా బీజేపీ ఎమ్మెల్యేలను ఎండగట్టారు.
సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడేందుకు ఎక్కువ టైమ్ ఇచ్చారు. ఆయన మాట్లాడినంత సేపు సమయం ఇచ్చారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి ముగ్గురు సభ్యులు ఉన్నారు. సభ్యుల సంఖ్య ఆధారంగా సభలో స్పీకర్ సమయం కేటాయిస్తారు. ఈ లెక్కన బీజేపీ కంటే కేవలం ఇద్దరు సభ్యులే కాంగ్రెస్ కు ఎక్కువ ఉన్నారు. మాట్లాడే సమయం కూడా బీజేపీ కంటే కాంగ్రెస్ కు కొన్ని నిమిషాలే ఎక్కువ ఇవ్వాలి. కాని సభలో జరిగింది మాత్రం వేరు. బీజేపీ ఎమ్మెల్యేల్లో రాజాసింగ్ జైల్లో ఉన్నారు. ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేశారు. మిగిలిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రమే సభకు హాజరయ్యారు. అయితే ఆయనకు మాట్లాడేందుకు కేవలంమూడు, నాలుగు నిమిషాలు మాత్రమే ఇచ్చారు స్పీకర్. కాని మల్లు భట్టి విక్రమార్కకు మాత్రం ఏకంగా గంటా 40 నిమిషాలు కేటాయించారు. రఘునందన్ మాట్లాడిన మూడు, నాలుగు నిమిషాల్లోనూ అధికార పార్టీ సభ్యులకు ఆయనకు కౌంటర్ ఇచ్చారు. కాని భట్టి విక్రమార్క గంటలకొద్ది మాట్లాడుతున్నా ఎలాంటి అడ్డంకులు స్పష్టించలేదు. ఒకసారి మంత్రులు అడ్డు తగిలే ప్రయత్నం చేసినా.. సీఎం కేసీఆర్ వారించి భట్టికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని సూచనలు చేశారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
కేసీఆర్ సూచనతోనే భట్టి విక్రమార్కకు స్పీకర్ ఎక్కువ సమయం ఇచ్చారనే చర్చ సాగుతోంది. కావాలనే భట్టిని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలే ఎక్కువగా చర్చకు వస్తాయి. కాని విక్రమార్క మాత్రం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ సర్కార్ పై ప్రశంసలు కురిపించారు. భట్టి ప్రసంగం టీఆర్ఎస్ ఎమ్మెల్యేను మరిపించిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎఫ్ఆర్‌బీఎం, విభజన చట్టం హామీలు విషయంలో కేంద్రాన్ని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసిన భట్టి.. తాను కారు పార్టీతో కలిసి పని చేస్తున్నాననే సంకేతం ఇచ్చారని అంటున్నారు.కేసీఆర్ డైరెక్షన్ లోనే భట్టి సభలో మాట్లాడారనే విమర్శలు వస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రధాన శత్రువు రేవంత్ రెడ్డి. అటు తెలంగాణ కాంగ్రెస్ లోనూ రేవంత్ రెడ్డికి భట్టికి గ్యాప్ ఉంది. దీంతో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా భట్టి విక్రమార్కను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారనే టాక్ నడుస్తోంది. అసెంబ్లీలో మోడీ ప్రభుత్వంపై భట్టి చేసిన ఆరోపణలు టీఆర్ఎస్ సానుకూలంగా మారాయి. అసెంబ్లీలో బీజేపీని టార్గెట్ చేయడానికి టీఆర్ఎస్ కు విక్రమార్క వ్యాఖ్యలు కలిసివచ్చాయని అంటున్నారు.
ఇప్పుడే కాదు గత రెండేళ్లుగా భట్టి విక్రమార్కకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు సీఎం కేసీఆర్. గత సెషన్ లోనూ భట్టిపై సభా వేదికపై ప్రశంసలు కురిపించారు. భట్టి లాంటి నేత పార్లమెంట్ లో ఉండాల్సి ఉందని కామెంట్ చేశారు. ఇక దళిత బంధు పథకం విషయంలోనూ భట్టికి ప్రాధాన్యత ఇచ్చారు కేసీఆర్. ప్రగతి భవన్ లో జరిగిన సమావేశానికి ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. పీసీసీ వద్దని చెబుతున్నా విక్రమార్క సీఎం భేటీకి హాజరయ్యారు. అంతేకాదు దళిత బంధు అమలుకు సంబంధించి నాలుగు నియోజకవర్గాలను ఎంపిక చేసిన కేసీఆర్.. భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. ఆ నియోజకవర్గంలోని చింతకాకాని మండలాన్ని దళిత బంధు కోసం ఎంపిక చేశారు. టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలను వదిలిసి సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క నియోజకవర్గాన్ని ఎంపిక చేయడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. తమకు ప్రధాన శుత్రువైన రేవంత్ రెడ్డిని కార్నర్ చేసే వ్యూహంలో భాగంగానే భట్టి విక్రమార్కను కేసీఆర్ ఎంకరేజ్ చేస్తున్నారని, ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు.
మరోవైపు అసెంబ్లీలో భట్టి విక్రమార్క చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలుస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై పీసీసీ పెద్ద ఎత్తున పోరాడుతుండగా.. అసెంబ్లీలో మాత్రం సీఎల్పీ అందుకు భిన్నంగా వ్యవహరించిందని మండిపడుతున్నారు. సభా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎంటగట్టకుండా.. ముఖ్యమంత్రికి మద్దతుగా నిలవడం ఏంటనే ప్రశ్నలు కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్నాయి. కేసీఆర్ ట్రాప్ లో పడిన భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేశారని అంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలు పార్టీ కేడర్ ను గందరగోళం పడేస్తున్నాయని.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క తీరుతో అది నిజమేననే సంకేతం జనాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని కొందరు పీసీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కమలనాధులు కూడా అసెంబ్లీలో సీఎం కేసీఆర్, భట్టి బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని వాయిస్ వినిపించేందుకు సిద్దమవుతోంది. మొత్తంగా అసెంబ్లీ పరిణామాలతో తమకు నష్టం జరిగిందనే భావనలోనే మెజార్టీ కాంగ్రెస్ నేతలు ఉన్నారని సమాచారం.
Read also: Godavari Floods: తెలుగు రాష్ట్రాలను వదలని వాన.. గోదావరి ఉగ్రరూపంతో హై అలర్ట్
Read also: AP CAPITAL: మూడు రాజధానులపై జగన్ కు షాక్.. టీడీపీ పొత్తుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook