ఇవాంక జస్ట్ ఓ వ్యాపారస్తురాలు.. అంతే..
రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాంకతో చేసుకున్న ఒప్పందాలేమైనా ఉంటే తెలంగాణ ప్రభుత్వం వాటిని బయట పెట్టాలని ఈ సందర్భంగా రాఘవులు పేర్కొన్నారు
హైదరాబాద్ నగరానికి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనడానికి వచ్చి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కేవలం ఓ వ్యాపారస్తురాలు మాత్రమే అని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తెలిపారు. ఇవాంక కూడా తండ్రి బాటలోనే ప్రయాణించే ఓ పెట్టుబడిదారి మాత్రమే అని.. ప్రతీ దేశంలో వ్యాపారాన్ని విస్తరించే దృష్టితో ఉండే ఇలాంటి వారు మన దేశ వికాసం కోసం ఏం చేయగలరని ఆయన అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాంకతో చేసుకున్న ఒప్పందాలేమైనా ఉంటే తెలంగాణ ప్రభుత్వం వాటిని బయట పెట్టాలని ఈ సందర్భంగా రాఘవులు పేర్కొన్నారు. ఇవాంక పర్యటన గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో హడావుడి చేశాయని, మీడియాలో కూడా రకరకాల వార్తలు, కథనాలు ప్రసారమయ్యాయని.. ఇండియాకు ఈ పర్యటన వల్ల భారీగా పరిశ్రమలు వస్తాయనీ కూడా కొన్ని ప్రచారాస్త్రాలను ప్రభుత్వం సంధించిందని.. కానీ అవన్నీ అభూత కల్పనలే అని బివి రాఘవులు అభిప్రాయపడ్డారు.