హైదరాబాద్: తెలంగాణ కేబినెట్‌లో మంత్రి ఈటెల రాజేందర్ పదవి పదిలమా కాదా అనే అంశంపై కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఎవరు మంత్రులుగా ఉన్నా.. జనానికి పెద్దగా ఒరిగేదేమీ లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం నాడు మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తావనకు వచ్చినప్పుడు జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ''తాము టీఆర్ఎస్ పార్టీ యజమానులమని.. మధ్యలో బతుకుజీవుడా అని బతికొచ్చినోళ్లం కాదు'' అని గతంలో ఈటల చేసిన వ్యాఖ్యలను సమర్థించిన జగ్గా రెడ్డి.. టీఆర్‌ఎస్‌కు ఈటల రాజేందర్ ఓనరేనని అన్నారు. పార్టీ కోసం ఎంతో పనిచేసిన ఈటల.. పార్టీ అభివృద్ధి కోసం డబ్బులు కూడా ఖర్చు చేశారని అన్నారు. బతుకుదెరువు కోసమే తాను గతంలో టీఆర్‌ఎస్‌లోకి వెళ్లానని చెప్పిన జగ్గా రెడ్డి... ఎవరు మంత్రులుగా ఉన్నా ఒరిగేది ఏమీ ఉండదని నిట్టూర్పు విడిచారు.


రాష్ట్రంలో విష జ్వరాలు ప్రభలుతుండటంపై స్పందించిన జగ్గా రెడ్డి.. ఈ విషయంలో ప్రభుత్వం వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 'ప్రగతి భవన్‌లో కుక్క చనిపోతే డాక్టర్ మీద కేసు పెట్టారని చెబుతూ.. మరి రాష్ట్రంలో విష జ్వరాలతో వందల మంది చనిపోతుంటే ఎవరి మీద కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.