K Kavitha: పాలన చేతగాక రేవంత్ రెడ్డి మా అన్న కేటీఆర్‌పై కుట్రలు
K Kavitha Slams To Revanth Reddy: పాలన చేతగాక రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని.. తన సోదరుడు కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
K Kavitha: పాలనపై చేతులు ఎత్తేసి రేవంత్ రెడ్డి మా అన్న కేటీఆర్‌పై ప్రతీకారం చేస్తున్నాడని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుట్రలో తన సోదరుడు కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. 'మేము కేసీఆర్ సైనికులం.. దీనికి భయపడే ప్రసక్తే లేదు' అని హెచ్చరించారు. మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని ప్రకటించారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
Also Read: Zoo Park Flyover: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. జూపార్క్ ఫ్లైఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా సోమవారం పర్యటించిన అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మితో కలిసి కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్ హయాంలో మొదలుపెట్టిన కార్యక్రమాలు, పథకాలను ప్రభుత్వం కొనసాగించాలి. జైనూరులో అత్యాచారానికి గురైన బాధితురాలికి ప్రభుత్వం సరైన వైద్యం కూడా చేయించలేదు. నిందితులకు ఇప్పటివరకు శిక్ష వేయించకపోవడం చాలా బాధాకరం' అని పేర్కొన్నారు.
Also Read: KT Rama Rao: 'మోసం.. దగా.. నయవంచనకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ.. రేవంత్ రెడ్డి'
'ప్రభుత్వ పెద్దలు ఎవరూ కూడా బాధితురాలికి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వం స్పందించని కారణంగా హింస చెలరేగింది. దాంతో ఎన్నో దుకాణాలు దగ్ధమయ్యాయి.. వాటికి ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం ఎందుకు ఇంత మొద్దు నిద్రపోతుంది? జైనూరు ఘటన తదనంతర పరిస్థితుల్లో నష్టపోయిన హిందువులు, ముస్లింలను ప్రభుత్వం ఆదుకోవాలి' అని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
'రూ 2 లక్షలతో పాటు శైలజ తండ్రికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు శైలజ తండ్రికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ఇప్పటివరకు దాదాపు 57 మంది పిల్లలు చనిపోయిన ప్రభుత్వంలో చలనం లేదు. చాయ్ తాగినంత సులువుగా సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏడాదిగా రేవంత్ రెడ్డి ఎన్ని చాయలు తాగారో తెలియదు కానీ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి మాత్రం ఆయన సమయం దొరకడం లేదు' అని కవిత ఎద్దేవా చేశారు.