కత్తి మహేష్ కాంట్రవర్శీ: పవన్ ఫ్యాన్స్‌కి ఓయూ స్టూడెంట్స్ వార్నింగ్ !
వీళ్ల మధ్య జరుగుతున్న వివాదంలోకి ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ప్రవేశించారు.
గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య మాటల యుద్ధం వివాదం గురువారం అనుకోకుండా మరో మలుపు తిరిగింది. వీళ్ల మధ్య జరుగుతున్న వివాదంలోకి ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ప్రవేశించారు. పవన్ కల్యాణ్ అభిమానులు బెదిరిస్తున్నట్టుగా కత్తి మహేశ్‌పై వారు కానీ దాడికి పాల్పడితే, ఆ తర్వాత ఇక పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో తిరగడం కష్టం అవుతుందని తెలుసుకోవాల్సిందిగా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు హెచ్చరించారు. అయితే, అంతకన్నా ముందుగా ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లిన కత్తి మహేష్.. అక్కడ ఓయూ జేఏసీ నేతలతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వాళ్లంతా కత్తి మహేష్‌కి అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఈ సందర్భంగానే కత్తి మహేష్‌కి అండగా భారీ సంఖ్యలో తరలివచ్చిన ఓయు విద్యార్థులు.. కత్తి మహేష్ పై దాడి జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పినట్టు పలు వార్తా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. అంతేకాకుండా ''పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో'' అంటూ పవన్‌కి వ్యతిరేక నినాదాలు సైతం చేశారు. ఊహించని విధంగా కత్తి మహేష్‌కి తమకు మధ్య కొనసాగుతున్న వివాదం మధ్యలోకి ఓయూ జేఏసీ ప్రవేశించడంపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి!