హైదరాబాద్: తెలంగాణ బంద్‌లో భాగంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఇవాళ ఉదయమే జేబీఎస్ వద్దకు చేరుకుని బంద్‌లో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలతో కలిసి ఆయన ఆందోళనల్లో పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ఉద్యమకారులపై ప్రభుత్వం చేయిస్తున్న అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పిన కోదండరామ్.. నేడు జరుగుతున్న తెలంగాణ బంద్‌కి సకలజనులు, సబ్బండవర్ణాలు మద్దతుపలకడమే తెలంగాణ ప్రభుత్వంపై వ్యక్తమవుతోన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు.


జేబిఎస్ వద్ద తెలంగాణ బంద్‌‌లో పాల్గొన్న కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించిన తనను అరెస్టు చేసినంత మాత్రాన్నే ఉద్యమాలు ఆగవని కోదండరామ్ నిరసన వ్యక్తంచేశారు.