ఏదేమైనా.. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా శనివారం టీజేఏసీ తలపెట్టిన స్ఫూర్తి సభను నిర్వహించి తీరుతామని పొలిటికల్ జేఏసీ నాయకుడు కోదండరాం స్పష్టంచేశారు. టీజేఏసీ నిర్వహించనున్న మిలియన్ మార్చ్ స్పూర్తి సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో తెల్లవారితే ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ నెలకొని వుంది. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన శక్తుల్లో ఒకటైన కోదండరాం తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిలుపునివ్వడమే ఈ ఉత్కంఠకు కారణమైంది. దీంతో ప్రస్తుత పరిస్థితిపై స్పందిస్తూ శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడిన కోదండరామ్.. 2011 మార్చి 10 న జరిగిన మిలియన్ మార్చ్ స్ఫూర్తిని గుర్తు చేసుకోవడానికే రేపు ట్యాంక్ బండ్ పై స్ఫూర్తి సభ ఏర్పాటు చేశామని అన్నారు. అయితే స్ఫూర్తి సభకు పోలీసులు అనుమతులు నిరాకరించినప్పటికీ.. ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిరసన వ్యక్తం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
 
శనివారం నాటి సభను అడ్డుకునేందుకు ఇప్పటికే జిల్లాల్లో, హైదరాబాద్‌లో పోలీసులు అక్రమంగా అనేకమందిని అరెస్ట్ చేశారని, వెంటనే వారందరిని బేషరతుగా విడుదల చేయాలని ఈ సందర్భంగా కోదండరాం డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి సభలు, సమావేశాలు పెట్టుకునే అవకాశం స్వయంగా రాజ్యంగమే కల్పించిందని కోదండరాం అభిప్రాయపడ్డారు.