తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ మహాకూటమికి మద్దతు పలికారు. గురువారం సాయంత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్.రమణ నివాసంలో సీపీఐ, టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు. మహాకూటమితో తాము చేతులు కలుపుతున్నామని.. ఈ కూటమితోనే టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడం సాధ్యపడుతుందని ఈ సందర్భంగా కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కోదండరామ్‌ని కనీస ఉమ్మడి కార్యక్రమ ఛైర్మన్‌ని చేయాలని టీజేఎస్ భావిస్తున్న క్రమంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీట్ల విషయంలో కలిసికట్టుగా మహాకూటమితో కలిసి నిర్ణయం తీసుకొని.. ఆ తర్వాత ఎన్నికలలో కేసీఆర్ సర్కారును ఓడిస్తామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు సీపీఐ, కాంగ్రెస్ పార్టీలను కూడా ఒప్పించి.. తాము కూడా కూటమిలో భాగమై.. తమ డిమాండ్లను కూడా చర్చలోకి తీసుకొస్తామని ఆయన అన్నారు. ఇటీవలే కోదండరామ్ తెలంగాణ జన సమితి తరఫున త్వరలోనే 25 నియోజకవర్గాల్లో ఇంటింటికి జనసమితి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ సదస్సులు నిర్వహించి తీరుతామని ఆయన అన్నారు. 


ఇటీవలే కోదండరామ్ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జనసమితి కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపుతుందని.. ఇప్పటికే ఎన్నికల గుర్తు కోసం ఎలక్షన్ కమీషనుకి దరఖాస్తు చేశామని ఆయన అన్నారు.తెలంగాణలో అసెంబ్లీని రద్దుచేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన చేతకాని తనాన్ని బయటపెట్టుకున్నారని.. ఆయనను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవి నుండి వెంటనే తొలిగించాలని తాము డిమాండ్ చేస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ తెలిపారు. ఈ మేరకు తాము గవర్నరుని కలుస్తామని కూడా ఆయన అన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో రాష్ట్రపతి పాలనే మేలని ఆయన ఇటీవలే తెలిపారు.