Munugode Bypoll News Updates: ఢిల్లీ వెళ్లి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తెలంగాణకు తిరిగి వస్తూనే మునుగోడు ఉపఎన్నికపై పెద్ద బాంబు పేల్చారు. శంషాబాద్ లో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలవదు అని ప్రత్యర్థులకు, కార్యకర్తలకు పరోక్షంగా సందేశం ఇచ్చేలా, పార్టీకి పలు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. '' మునుగోడులో కూడా హుజూరాబాద్‌‌లో వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి మూడు వేలు లేదా నాలుగు వేల ఓట్లు మాత్రమే వస్తాయి'' అని జోస్యం చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ప్రచారంలో తాను పాల్గొనబోనని తేల్చిచెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలనుబట్టి చూస్తే.. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకం ఆయనకు లేకపోవడం వల్లే ఇలా వ్యాఖ్యానించి ఉంటారనే టాక్ వినిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ తో పాటు తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యావహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారని అన్నారు. తెలంగాణ పీసీసీ ఎంపిక విషయంలో పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్నట్టు నాటకాలు ఆడి పార్టీని తప్పుదోవ పట్టించారని, పార్టీనే నమ్ముకున్న తనలాంటి వారిని పక్కకు పెట్టి నాలుగు పార్టీలు మారి వచ్చిన వారిని పీసీసీ చీఫ్‌ని చేశారని మండిపడ్డారు. 


మాణిక్యం ఠాగూర్ లాంటి అనుభవం లేని వాళ్ల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంప మునిగిందన్న కోమటిరెడ్డి.. కమల్ నాథ్ లాంటి సీనియర్ నేతలను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జులుగా నియమించి పార్టీని చక్కబెట్టాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి అభిప్రాయ సేకరణ చేసి తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్‌ని నియమించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీని డిమాండ్ చేశారు. 


మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కి మంచి పట్టుంది. నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పినట్టు వినే కాంగ్రెస్ పార్టీ కేడర్ ఉన్నారు. అయినప్పటికీ.. మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా వెళ్లక ముందే.. అభ్యర్థి ఎవరో కూడా ఇంకా తేలక ముందే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మూన్నాలుగు వేల ఓట్లు మాత్రమే వస్తాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చిచెప్పేశారంటే.. అక్కడి ఉప ఎన్నిక ఫలితంపై కోమటిరెడ్డి బ్రదర్స్‌కి పిక్చర్ క్రిస్టల్ క్లియర్‌గా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


ఓవైపు తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వస్తున్న ఉప ఎన్నిక కాగా..  కాంగ్రెస్ పార్టీ తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆగ్రహం మరోవైపు.. అందుకే మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే కోరిక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలో ఏమాత్రం లేనట్టుందంటున్నారు. మునుగోడులో ప్రచారానికి దూరంగా ఉండాలని డిసైడ్ అవడానికి కారణం కూడా అదే అయ్యుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. తాను కాంగ్రెస్ పార్టీ వీడే ప్రసక్తే లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat Reddy) మరోసారి స్పష్టంచేసినప్పటికీ.. ఆయన రాజకీయ వ్యూహాలపై వస్తున్న రూమర్స్‌కి మాత్రం తెరపడటం లేదు.


Also Read : Bandi Sanjay with Jr Ntr: నాడు నోటికొచ్చినంతగా తిట్టి..నేడు షేక్‌హ్యాండ్, ఫోటోలు


Also Read : Munugode Bypoll: అమిత్ షా సభతో బీజేపీలో జోష్.. బీసీ కార్డు పైనే టీఆర్ఎస్ ఫోకస్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి