పీసీసీ అధ్యక్ష పదవిపై కోమటిరెడ్డి ధీమా
పీసీసీ అధ్యక్ష పదవిపై కోమటిరెడ్డి ధీమా
నల్గొండ: పీసీసీ అధ్యక్ష పదవికి బరిలో తానే ముందున్నానని యాదాద్రి-భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. రేసులో ఉన్న వారిలో అందరికన్నా తానే సీనియర్‌ని అవడమే అందుకు ఓ కారణం అని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో విభేదాలపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలో విభేదాలు సహజమేనని.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో విభేదాలు కూడా అటువంటిదే తప్ప మరొకటి కాదని వివరించారు.
హుజుర్‌నగర్ ఉప ఎన్నిక గురించి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అక్కడ గెలుపుపై నమ్మకం లేకపోవడం వల్లే అధికార పార్టీ తమ మంత్రులు, ఎమ్మెల్యేలను అందరినీ హుజూర్‌నగర్‌లో ప్రచారానికి రప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ నేతలు ఎన్ని చెప్పినా.. ప్రస్తుతం వారి మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలను భయపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే నియోజకవర్గానికి అభివృద్ధి నిధులంటూ టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అసెంబ్లీలో నిధుల కోసం గగ్గోలుపెడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.