నల్గొండ మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త, స్థానిక కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య వెనుక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రమేయం ఉందని టీ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన వీహెచ్.. గ్యాంగ్‌స్టర్ నయీంలా ఎమ్మెల్యే వీరేశంను ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయరు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ పతనం నల్గొండ నుంచే మొదలైంది అని అభిప్రాయపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీహెచ్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ.. నల్గొండ డీఎస్పీ సుధాకర్‌ను విధుల నుంచి తప్పించి విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకొస్తాయని అన్నారు. ప్రభుత్వం ఆగడాలు చూసి కాంగ్రెస్‌ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని పార్టీ శ్రేణులకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
 
బుధవారం అర్థరాత్రి దారుణ హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్ సిఎల్పీ ఉపనేత, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఈ కారణంగానే బొడ్డుపల్లి శ్రీనివాస్‌ని హతమార్చి రాజకీయంగా పైచేయి సాధించాలనే ఉద్దేశంతోనే అతడిని రాజకీయ ప్రత్యర్థులు హతమార్చారనే సందేహాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో పోలీసులు నలుగురు నిందితులని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 


ఇదిలావుంటే, ఈ కేసులో ప్రధాన నిందితులు ఉట్కూరులో తలదాచుకున్నారని తెలిసిందని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. శ్రీనివాస్ హత్య కేసుతో సంబంధం వున్న ఎమ్మెల్యే వీరేశంను అరెస్ట్ చేసి అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.