komatireddy Venkat Reddy Slams Union Minister Kishan Reddy: హైదరాబాద్ : " మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది " అని ఆ పార్టీ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం అని తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీలే స్వయంగా ప్రకటించారు అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ బిల్లుగా అభివర్ణిస్తూ ఇది మా బిల్లు అంటూ సోనియా గాంధీ ప్రకటన కూడా చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. 


మహిళా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని.. అందుకే ఆ పార్టీ ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం కోసం జరిగే ఓటింగ్ సమయంలో పార్లమెంట్ లో లేరు అంటూ కేంద్రమంత్రి, బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పి కొడుతూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యేటప్పుడు బీజేపీకి చెందిన 66 మంది ఎంపీలు పార్లమెంట్ లో లేరన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... ఆ 66 మంది బిజెపి ఎంపీలు ఎందుకు లేరు అనే ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.