Police Lathi Charge: రైతులపై లాఠీచార్జ్ చేయడమే మార్పా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
KTR Condemned Adilabad Police Lathi Charge Against Farmers: తెలంగాణలో రైతులు అరిగోసలు పడుతున్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో పొలం పనులకు సన్నద్ధమవుతున్న రైతులకు విత్తనాలు దొరకడం లేదు. విత్తనాల కోసం ఎగబడితే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీనిని కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు.
KTR Condemned: విత్తనాల కోసం ఎదురుచూస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతులపై దాడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు మండిపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
విత్తనాల కోసం ఆదిలాబాద్‌లో రైతులు ఎగబడితే మంగళవారం పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసుల తీరుపై రైతులు తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే అని స్పష్టం చేశారు.
Also Read: Kiss Stops Marriage: ప్రేమతో పెట్టిన ముద్దుతో వివాహం రద్దు.. ఆస్పత్రిలో వరుడు
రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే ఒక ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లాఠీచార్జ్ చేసిన అధికారులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. రైతులపై ప్రభుత్వ దాడులు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. రైతుల కోసం కావాల్సిన సాగునీరు మొదలుకొని.. రైతుబంధు వరకు, చివరికి కనీసం విత్తనాలు అందించలేని దుర్మార్గపూరిత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానదని దుమ్మెత్తి పోశారు. మార్పు తెస్తామని చెప్పి రైతులపై లాఠీఛార్జ్ పేరుతో దాడులు చేయడమే కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తానన్న మార్పా అని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వంలో రైతులు ఎలాంటి ఆందోళన పడకుండానే విత్తనాలు, ఎరువులు, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు అన్నీ పొందారని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ 5 నెలల్లోనే పరిస్థితి పూర్తిగా తారుమారైందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం పేరిట, ఢిల్లీ పర్యటన పేరిట టూర్లు వేయడమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. రైతులకు అండగా ఉంటామని.. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter