నెల్లూరు జిల్లాకి చెందిన రోహిత్ కుమార్ రెడ్డి అనే యువకుడు తెలంగాణ ఐటిశాఖ మంత్రి కేటీఆర్‌కు వీరాభిమానిగా మారాడు. తెలంగాణలో ఆయన చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడై రోహిత్ కుమార్, కేటీఆర్‌కు అభిమానిగా మారాడు. ఈ క్రమంలో తన అభిమాన నాయకుడిని కలవడానికి పాదయాత్ర చేస్తూ విజయవాడ నుండి హైదరాబాద్‌కి ఆయన రావడం జరిగింది. ఈ పాదయాత్ర చేయడానికి దాదాపు 17 రోజులు పట్టిందని రోహిత్ తెలపడం గమనార్హం. ఈ విషయాన్ని తెలుసుకున్న టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ రోహిత్‌ను ప్రత్యేకంగా కలిశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయనను దగ్గరుండి కేటీఆర్ ఆఫీసుకి తీసుకెళ్లారు. రోహిత్ గురించి విని కేటీఆర్ ఆశ్చర్యపోయారు. తన అభిమానిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని.. కుశల ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా రోహిత్ కేటీఆర్‌తో పలు విషయాలు పంచుకున్నారు. తనకు రాబోయే తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచార కార్యకర్తగా అవకాశమివ్వాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తున్న పలు పథకాలు యువతకు ప్రేరణ అందించే విధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. 


రోహిత్ ఆలోచనకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఓ జ్ఞాపికను ఆయన రోహిత్‌కు బహుమతిగా అందించారు. రోహిత్ కూడా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ... తన మద్దతు ప్రకటించారు. కేటీఆర్ బొమ్మను తాను టాటూగా వేయించుకున్నానని కూడా అన్నారు. కేటీఆర్ తన మంత్రివర్గ సభ్యులను రోహిత్‌కు పరిచయం చేశారు. తనను ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి కలిసినందుకు ధన్యవాదాలు తెలిపారు.