KTR Formula E race Case :జైలుకు వెళ్లి వస్తే సీఎం అవుతారా..? జగన్, రేవంత్, బాబు బాటలో కేటీఆర్..?
KTR Formula E race Case : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జైలుకెళ్లడానికి మానసికంగా సిద్దపడ్డారా..? రేవంత్ సర్కార్ తనను ఎలాగైనా అరెస్ట్ చేస్తుందని డిసైడ్ అయ్యారా..? రెండు, మూడు నెలలు జైలులో ఉండేందుకైనా సిద్దం అని కేటీఆర్ అనడం వెనుక ఆంతర్యం ఏంటి..? జైలుకు వెళ్లి వచ్చిన వారికి ఆ కీలక పదవి దక్కుతుందన్న సెంటిమెంట్ ను కేటీఆర్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా..? జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నాని కేటీఆర్ ఉత్సాహంగా ప్రకటించడం వెనుక మతలబు అదేనా..?
KTR Formula E race Case : తెలంగాణలో ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ వ్యవహారం సంచలనంగా మారింది. గత ప్రభుత్వం హయాంలో ఫార్ములా ఈ రేస్ లో 55 కోట్ల రూపాయలు గోల్ మాల్ జరిగిందనేది రేవంత్ సర్కార్ వాదన. దీనిలో భాగంగా గత ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న కేటీఆర్ దీని అంతటికి భాధ్యుడు అనేది కాంగ్రెస్ ఆరోపణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టార్గెట్ గా ప్రభుత్వం ఏసీబీ విచారణ జరుబోతుందనే ప్రచారం పొలిటికల్ సర్కిల్ లో జోరుగా కొనసాగుతుంది.గత రెండు మూడు రోజులుగా కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ విచారణ కోసం ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం లేఖ రాసిందని ఒక్క సారి గవర్నర్ నుంచి అనుమతి రాగానే ఇక కేటీఆర్ విచారణ జోరందుకుంటుందనేది రాజకీయ వర్గాల్లోచర్చ.
ఈ ప్రచారం ఇలా ఉండగానే కేటీఆర్ కూడా ఫార్ములా ఈ రేస్ పై వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫార్ములా ఈ రేస్ లో అంతా నిబంధనల ప్రకారమే డబ్బులు కేటాయింపు జరిగిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంతే కాదు కాంగ్రెస్ తనపై కక్ష పూరితంగా వ్యవహరించాలని అనుకుంటుందని ,అందుకే ఈ అరెస్ట్ ప్రచారం తెర మీదకు తెచ్చిందని కేటీఆర్ అంటున్నారు. తెలంగాణ ప్రయోజనాలు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలన్న ఉద్దేశంతో తాము ఫార్ములా ఈ రేస్ చేపట్టామని దానిలో ఎలాంటి గందరగోళం జరగలేదన్నారు. కానీ రేవంత్ రెడ్డి తనను ఏదో రకంగా అరెస్ట్ చేయాలని అనుకుంటుందని కేటీఆర్ అంటున్నారు. తాను ఈ బెదిరింపులకు భయపడేది లేదని ఎలాంటి పరిస్థితులు వచ్చినా తాము ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానంటూ కూడా కేటీఆర్ ప్రకటించారు.
ఇంత వరకు బాగానే ఉన్నా కేటీఆర్ మరో సంచలన కామెంట్స్ చేశారు. అవసరమైతే రెండు మూడు నెలల జైలులో ఉండటానికి తాను సిద్దంగా ఉన్నానంటూ కేటీఆర్ అనడం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో సెన్సేషనల్ గా మారింది. బయట జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా కేటీఆర్ జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉన్నానంటూ ప్రకటించడంపై అంతటా హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. జైలుకు వెళ్లడమే కాదు అక్కడ ప్రశాంతంగా యోగా చేసి ట్రిమ్ అవుతానంటూ చమత్కరించారు. జైలు నుంచి విడుదల అయ్యాక తెలంగాణ అంతటా పాదయాత్ర చేస్తానని తెగ ఉత్సాహంగా ప్రకటించడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కేటీఆర్ మాటలను బట్టి చూస్తుంటే కేటీఆర్ జైలుకు వెళ్లడానికి మానసికంగా సిద్దమయ్యారని,జైలు నుంచి విడుదలయ్యాక ఏం చేయాలో కూడా ఒక ప్లాన్ సిద్దం చేసుకున్నట్లు కనబడుతుందని టాక్ నడుస్తుంది. ఇప్పటికే పాదయాత్ర చేయాలని డిసైడ్ ఐన కేటీఆర్ అరెస్ట్ ప్రచారంతో దాని షెడ్యూల్ మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఏదో కేసులో తనని అరెస్ట్ చేయడం గ్యారెంటీ అని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ముందస్తు ప్లాన్ లో భాగంగా పాదయాత్రపై కొద్ది రోజులు వేచి చూసే ధోరణిలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వేళ రేవంత్ సర్కార్ తనను అరెస్ట్ చేస్తే జైలు నుంచి వచ్చిన తరువాత పాదయాత్ర చేయాలనుకుంటున్నారట కేటీఆర్. అప్పుడు పాదయాత్ర చేస్తే ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది అనేది కేటీఆర్ ఆలోచనట. అందుకే నన్ను అరెస్ట్ చేయవచ్చు, జైలు వెళ్లడానికి సిద్దం అని ముందే ప్రకటించడం ద్వారా క్యాడర్ లో కూడా కొంత సెంటిమెంట్ ను రగలించారు కేటీఆర్.
ఐతే కేటీఆర్ జైలుకు వెళ్లడానికి సిద్దం అన్న మాటలపై పొలిటికల్ సర్కిల్స్ ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో అరెస్ట్ అయి జైలులో ఉండొచ్చిన ప్రధాన ప్రతిపక్ష నాయకులంగా సీఎంలు అయిన చరిత్ర ఉందని. దీంతో కేటీఆర్ కూడా జైలుకు వెళ్లాలనుకుంటున్నట్లు ఉన్నారని అనుకుంటున్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కొద్ది రోజులు జైలులో ఉండి వచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు. ఇక ఏపీలో కూడా ఇదే పరిస్థితి. ఏపీ తాజా, మాజీ సీఎంలు ఇద్దరు కూడా ప్రతిపక్షంలో ఉండగా అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన వారే. అనంతరం వారిద్దరు కూడా జైలు నుంచి విడుదలయ్యాక జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ కూడా ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవ్వాలని అనుకుంటున్నారా అన్న చర్చ బయట జరుగుతుంది.
మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ ప్రచారం ఇప్పుడు తెలంగాణలో పెద్ద సంచలనంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.కేటీఆర్ విషయంలో అసలు రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది..? అందరూ అనుకుంటున్నట్లుగా నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ను అరెస్ట్ చేస్తుందా లేక ఎప్పటిలాగే ప్రచారానికే పరిమితమైతుందా అనేది మాత్రం తేల్చాల్సింది కాలమే.
so Read: Iqoo 13 Price: ఫీచర్స్ అన్ని అదుర్స్.. 50MP ప్రధాన కెమెరాతో iQOO 13 మొబైల్ విడుదల..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.