KTR Meets Industrialists: ముంబైలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్
KTR Meets Industrialists in Mumbai: తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ముంబైలో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, జేయస్‌డబ్ల్యు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.
KTR Meets Industrialists in Mumbai: తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ముంబైలో మెరుపు పర్యటనలు చేసి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యారు. ముంబైలోని టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌజ్‌లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయి తెలంగాణలో పెట్టుబడులపై చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై మాట్లాడిన మంత్రి కేటీఆర్, తెలంగాణలో టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు వివిధ రంగాల్లో ఉన్న అవకాశాల గురించి వివరించారు. తెలంగాణలో వ్యాపార రంగానికి ఉన్న అనుకూల పరిస్థితులు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని టాటా గ్రూపు తెలంగాణలో వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి కేటీఆర్ చంద్రశేఖరన్ కి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వ్యాపార విస్తరణ ప్రణాళికల్లోనూ టాటా గ్రూప్ తెలంగాణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారు.
విమానయాన రంగంలో టాటా సంస్థ మంచి పురోగతి సాగిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఒక ఎమ్మార్వో (మెయిటెనెన్స్, ) కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ టాటా సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కి విజ్ఞప్తి చేశారు.
జేయస్‌డబ్ల్యు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్‌తో
జేయస్‌డబ్ల్యు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్‌తో ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. జేయస్‌డబ్ల్యు సంస్థకు స్టీల్, సిమెంట్ వంటి రంగాల్లో ఉన్న అపారమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ ఈ భేటీలో జిందాల్ ని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సేయిల్ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. బయ్యారంతో పాటు పక్కనే ఉన్న చత్తీస్ ఘడ్ లో ఉన్న ఇనుప ఖనిజం నిల్వలను దృష్టిలో ఉంచుకొని అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని కేటీఆర్ జేయస్‌డబ్ల్యు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ దృష్టికి తీసుకొచ్చారు.
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో మంత్రి కేటీఆర్
ఆ తరువాత హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతోనూ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా వివరించారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంతో పాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఆయా రంగాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇదే సరైన అవకాశమని మంత్రి కేటీఆర్ సూచించారు.