సీఎం కాబోతున్నారా అనే ప్రశ్నకు స్పందించిన కేటీఆర్
కేటీఆర్‌కి పాత్రికేయుడి సూటి ప్రశ్న
హైదరాబాద్ : వచ్చే ఏడాది మే లేదా జూన్ నెలలో జరగబోయే మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్థానంలో మీరే రాబోతున్నారా అని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. తెలంగాణకు రానున్న మరో పది, పదిహేనేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగాలని తనతోపాటు యావత్ టీఆర్ఎస్ కోరుకుంటోందని కేటీఆర్ సెలవిచ్చారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఈ సమాధానం ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారని కేటీఆర్ చెప్పిన క్రమంలో.. అటువంటప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి జాతీయ రాజకీయాలపై దృష్టిసారిస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి స్థానాన్ని మీరు(కేటీఆర్) భర్తీ చేయనున్నారా అనే సందేహాలు తలెత్తిన నేపథ్యంలో ఓ విలేకరి కేటీఆర్‌ను ఈ ప్రశ్న అడిగారు.
అయితే, విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందించిన కేటీఆర్.. తర్వాతి ముఖ్యమంత్రి కూడా కేసీఆరేనని చెప్పడమే కాకుండా.. దేశ రాజకీయాలను శాసించాలంటే ఢిల్లీకే వెళ్లాల్సిన అవసరం లేదని, హైదరాబాద్‌లో ఉండి కూడా పరిస్థితులను చక్కదిద్దొచ్చని అన్నారు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనూ ఆయన హైదరాబాద్ నుంచే దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు.