హైదరాబాద్: పార్టీ పెద్దలు ముందస్తుగా నిర్ణయించిన సుముహూర్తం ప్రకారం నేడు ఉదయం 11:56 గంటలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామా రావు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి సమీపంలోని రౌండ్‌ టేబుల్‌ స్కూల్‌ నుంచి టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా తెలంగాణభవన్‌కు చేరుకున్న కేటీఆర్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది. తెలంగాణ భవన్ కు చేరుకున్న అనంతరం ముందుగా కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాంబర్‌లోకి చేరుకున్న కేటీఆర్.. పార్టీ కీలక నేతల సమక్షంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. కేటీఆర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నేతలు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.


కేటీఆర్‌కి పట్టాభిషేకం తరహాలో కొనసాగిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హోంమంత్రి మహమూద్ అలీ, హరీష్‌ రావు సహా ఇతర మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలంగాణ భవన్‌కి చేరుకోవడంతో అక్కడ పండగ వాతావరణం కనిపించింది.