TSRTC strike: కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే.. పరిష్కారం కోరిన జేపి
టిఎస్ఆర్టీసీ సమ్మె(TSRTC strike) 47 రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ఓ లేఖ రాశారు.
హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ సమ్మె(TSRTC strike) 47 రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ఓ లేఖ రాశారు. ఆర్టీసీని కూడా ప్రైవేటు రంగంతో పోటీ పడేలా చేయాలనే కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థించిన జయప్రకాశ్ నారాయణ... ఆర్టీసీ విలీనం విషయంలో కార్మికులు వెనక్కి తగ్గడం అనేది ఒకరకంగా కేసీఆర్ వాదనలకు లభించిన విజయమేనని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ని పక్కనపెట్టిన ప్రభుత్వానికి సహకరించేందుకు ముందుకొచ్చిన కార్మికులను కూడా అభినందించాలని జేపి ఆ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో కార్మికులు జోక్యం చేసుకోవద్దని జేపి సూచించినట్టు తెలుస్తోంది.
Read also : ఆర్టీసీ సమ్మె: టీ సర్కార్ విజ్ఞప్తికి నో చెప్పిన హై కోర్టు
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్‌ని కార్మికులు పక్కనపెట్టిన నేపథ్యంలో ఇకనైనా వారి మిగతా సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాల్సిందిగా జేపి ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కార్మికులను చర్చలకు ఆహ్వానించి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని.. వారి మిగతా డిమాండ్ల విషయంలోనైనా సీఎం కేసీఆర్ కొంత ఉదారంగా వ్యవహరించాలని జేపి కోరారు.