MH CREDAI Delegates Visits Hyderabad: తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర నుంచి 250 మందితో కూడిన రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల బృందం మూడు రోజులపాటు హైదరాబాద్‌లో పర్యటిస్తోంది. తెలంగాణ అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి నగరానికి విచ్చేసిన మహారాష్ట్ర ప్రతినిధుల బృందానికి స్వాగతం పలికిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. శుక్రవారం వారితో టీ హబ్‌లో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నగరం ప్రగతిపై వారికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేపట్టిన ప్రణాళిక బద్ధమైన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రస్తావించిన అంశాల్లోంచి పలు ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విద్యార్థిగా పూణేలో చదివిన రోజుల నుంచి మహారాష్ట్రతో తనకు అనుబంధం ఉందని తెలిపిన మంత్రి కేటీఆర్.. మహారాష్ట్రలోని అనేక జిల్లాలు చారిత్రాత్మకంగా తెలంగాణతో అనుబంధాన్ని కలిగి ఉన్నాయని.. ఎందుకంటే అవి గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి అని గుర్తుచేసుకున్నారు. అందుకే తెలంగాణ - మహారాష్ట్రల మధ్యన సాంస్కృతిక, మానవ సంబంధాలు బలంగా ఉన్నాయి అని అన్నారు. దశాబ్దంన్నరపాటు అనేక ఉద్యమాల తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన నాడు ఉన్న అనేక అనుమానాలను పటాపంచలు చేస్తూ 10 సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. 


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాడు ఉన్న విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా వంటి సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కోగలిగాం. భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అనే మాట వాస్తవమైనప్పటికీ.. దేశాన్ని నడిపిస్తున్నది మాత్రం నగర ప్రాంతాలే అన్న వాస్తవాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలన్నారు. ఎంత ఎక్కువ నిధులను మౌలిక వసతుల కల్పన పై వెచ్చిస్తే.. నగరాల అభివృద్ధి అంత వేగంగా సాధ్యం అవుతుందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బహుముఖ వ్యూహంతో మా ప్రభుత్వం పని చేసిందని.. హైదరాబాద్ నగరంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాలతో పాటు లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగంలోనూ భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా అవసరమైన మౌలిక వసతుల కల్పనను చేపట్టాం అని మహారాష్ట్ర ప్రతినిధుల బృందానికి తెలిపారు. అందుకే ఈరోజు అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్ నగరంలో తమ అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయి అని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. 


హైదరాబాద్ నగరం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బెంగళూరు నగరాన్ని ఐటి ఉద్యోగాల కల్పనలో వరుసగా రెండు సంవత్సరాలు దాటివేసింది. ఐటీ ఎగుమతులతో పాటు వరి ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం మౌలిక వసతులతో పాటు పరిపాలన సంస్కరణలపైన ప్రధానంగా దృష్టి సారించింది. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా విప్లవాత్మకమైన టీఎస్ ఐపాస్, భవన నిర్మాణాలు అనుమతుల కోసం టిఎస్ బి పాస్ ను ప్రవేశపెట్టిందన్నారు.  


ఇప్పటికే తెలంగాణ విధానాలను, ఇక్కడ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను అనేక రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసి వెళ్ళాయి. అందుకే తెలంగాణ ఈరోజు చేసిన కార్యక్రమాలను భారతదేశం రేపు అనుసరిస్తుంది అని అంటున్నాం అని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టి భవిష్యత్తు విస్తరణకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దే ప్రయత్నాలను మా ప్రభుత్వం చేస్తోంది. హైదరాబాద్ నగరంలో 415 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఎస్ ఆర్ డి పి ఆధ్వర్యంలో ఇప్పటికే భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసి అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జి లాంటి నిర్మాణాలను పూర్తి చేశాం అని వివరించారు. 


హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ప్రారంభించిన సి ఆర్ ఎం పి కార్యక్రమాన్ని అధ్యయనం చేసిన తర్వాత ముంబై నగరం కూడా అనుసరిస్తోంది. భవిష్యత్తు అవసరాలకు అవసరమైన విద్యుత్, తాగునీటి సరఫరా వ్యవస్థలను సిద్ధం చేయబోతున్నాం. 100% మురుగు నీటిని శుద్ధి చేసే తొలి నగరంగా మారబోతున్నాం. హైదరాబాద్ నగర ప్రగతిని అనేకమంది ప్రముఖులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. దేశంలో ముంబై నగరం తర్వాత ఎత్తైన భవనాలు కలిగిన నగరంగా హైదరాబాద్ స్థానం సంపాదించుకుంది. వినూత్నమైన టిడిఆర్ విధానం ద్వారా సుమారు 5 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని జిహెచ్ఎంసి పొదుపు చేయగలిగింది అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 


టీఎస్ బి పాస్ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు రియల్ ఎస్టేట్ రంగ భాగస్వాములతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సమావేశమై నగర అభివృద్ధి కోసం అవసరమైన కార్యక్రమాల విషయంలో సుదీర్ఘమైన సమావేశం ఏర్పాటు చేసి ఒక్కరోజే 7 జీవోలను జారీ చేయడం జరిగింది అని మంత్రి కేటీఆర్ మహారాష్ట్ర ప్రతినిధుల బృందానికి తెలిపారు. దేశంతోనే అతిపెద్ద మురికివాడల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారికి పక్కా ఇల్లు నిర్మించి ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. ప్రతి పట్టణ, స్థానిక సంస్థల బడ్జెట్లో 10% గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. 


తెలంగాణ బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా అభివృద్ధి చెందుతోందన్న మహారాష్ట్ర ప్రతినిధి బృందం
హైదరాబాద్ నగరం గత పది సంవత్సరాలలో అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రం ఏర్పాటు కన్నా ముందు హైదరాబాద్ నగరంలో ఉన్న పరిస్థితి తమకు గుర్తుంది అన్నారు. పరిపాలకులకు సరైన విజన్ ఉంటే, నగరం కానీ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అనడానికి, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ గత పది సంవత్సరాలలో సాధించిన ప్రగతి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అన్నారు.  ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం బుల్లెట్ ట్రైన్ వేగాన్ని మించి అభివృద్ధి చెందుతుందని ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర విధానాలు, కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిన విధానం గురించి అనేక అంశాలను తెలుసుకున్నామని మహారాష్ట్ర ప్రతినిధుల బృందం అభిప్రాయపడింది.